Telugu-student-killed-in-Road-accident-in-America

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థి మృతి

కనెక్టికట్: అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి దుర్మరణం చెందాడు. హైదరాబాద్‌కు చెందిన నాగ తులసీరామ్ అనే 26 ఏళ్ల విద్యార్థి పీజీ చేసేందుకు అమెరికాకు వెళ్లాడు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 7.21 గంటల సమయంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తులసీరామ్ మరణించాడు. కనెక్టికట్‌లోని షెల్టన్ నగరంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ కారు.. తులసీరామ్‌ కారును ఢీకొట్టడం.. తులసీరామ్ అక్కడికక్కడే మరణించడం వెంటనే జరిగిపోయాయి. బయటకు దూకేందుకు వీలులేకపోవడంతో తులసీరామ్ కారులోనే ఇరుక్కుపోయి మరణించాడు. తులసీరామ్ మరణ వార్తను అతడి తల్లిదండ్రులకు బుధవారం తెలియజేశారు. హైదరాబాద్‌లోని సూరారం ప్రాంతంలో తులసీరామ్ తండ్రి జాకబ్ నివాసముంటున్నారు. కుమారుడు పీజీ చేసేందుకు అమెరికా వెళ్లాడనీ, అక్కడే ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తున్నాడనీ, ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని జాకబ్ కన్నీటిపర్యంతమయ్యాడు. కుమారుడి మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అధికారులు సత్వర ఏర్పాట్లు చేయాలని కోరాడు.