Telugu-people-faced-problems-in-Kuwait

కువైత్‌ ‘చట్ట బంధం’లో ప్రవాసులు

కేసులు కొలిక్కి వస్తేనే స్వదేశానికి..

ఫోన్లు, బిల్లులు, కేసులతో ఇబ్బందులు
అష్టకష్టాలు పడుతున్న తెలుగువారు
ఆమ్నెస్టీ అయినా కనికరించేనా?
భారత ఎంబసీ అధికారులు ఆదుకోవాలని వినతి
ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి: కువైత్‌లో ఉంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆ దేశ చట్టాల కారణంగా స్వదేశానికి తిరిగి రావడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులకు వారి వారి దేశాలకు వెళ్లిపోయేందుకు కువైత్‌ ప్రభుత్వం క్షమాభిక్ష పథకం పొడిగించినప్పటికీ తెలుగు ప్రజలు చట్టపరమైన సమస్యల కారణంగా అష్టకష్టాలు పడుతున్నారు. కువైతీ హాకమా(న్యాయస్థానాలు)ల్లో కేసులు కొలిక్కి వస్తేగానీ వీరు కువైత్‌ను విడిచి వెళ్లడానికి అవకాశం ఉండదు. ఫోన్‌ బిల్లుల విషయంలో మాత్రం ఇప్పటికే పబ్లిక్‌ ప్రాసిక్యూషన్లు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సంబంధిత బిల్లులు చెల్లించి సొంత ప్రాంతాలకు వెళ్లిపోవచ్చు. మిగిలిన నేరారోపణలపై మహాకమాల్లో కేసులు ఎదుర్కొంటున్నవారు మాత్రం తప్పనిసరిగా న్యాయప్రక్రియను పూర్తి చేయాల్సిందే.
 
  • రాజమండ్రి రూరల్‌ మండలం మోరంపూడికి చెందిన బత్తిన వెంకన్న మూడు ఐ ఫోన్లు కొనుగోలు చేశాడు. సిమ్‌కార్డులతో సహా వాయిదాల పద్ధతిలో ఈ ఫోన్లను కొన్నాడు. బకాయిలు చెల్లించలేదు. 3వేల దిర్హాంలు (సుమారు రూ.6.5 లక్షలు) చెల్లించలేక నిస్సహాయంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో గడువు పొడిగించినా స్వస్థలానికి రాలేకపోతున్నాడు.
  • నిర్మల్‌ జిల్లా కడెం మండలానికి చెందిన నాగావత్‌ శ్యాంలాల్‌బుక్యా నాయక్‌.. తక్షణ అవసరం కింద ఫోన్‌, సిమ్‌కార్డు కొనుక్కొని దాన్ని బంగ్లా దేశస్థుడికి విక్రయించాడు. అతను వాడిన బిల్లు కాస్తా నాయక్‌ నెత్తిన పడింది. ఇప్పుడా బిల్లు చెల్లిస్తేనే నాయక్‌ స్వదేశానికి వెళ్లగలుగుతాడు.
  • విశాఖపట్నం జిల్లా దేవరపల్లి మండలానికి చెందిన ఆర్‌.అప్పలనాయుడిది కూడా ఇదే పరిస్థితి.
  • నిజామాబాద్‌ జిల్లా దర్పల్లికి చెందిన అలీ అబ్బాస్‌ది మరో గాథ. తాను పనిచేస్తున్న పెట్రోలు పంపులో అగ్నిప్రమాదం జరగడంతో ఓ కారు దగ్ధమైందని, ఆ కారు యజమాని అకారణంగా తనపై పెట్టిన కేసు వల్ల స్వదేశానికి తిరిగి వెళ్లలేకపోతున్నట్లు వాపోయాడు.
  • వేలిముద్రల సేకరణ పూర్తయినా ఇంకా నివేదిక రాకపోవడంతో ఏమైనా కేసు ఉందేమోనని భయంగా ఉన్నట్లు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలానికి చెందిన సందాడి మియమ్మ ఆందోళన చెందుతోంది.
  • కడప జిల్లాకు చెందిన పలువురు మహిళలకు పేర్లలో వ్యత్యాసాలు ఉండడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
 
మొత్తం మీద ప్రవాసుల వాదన సరైందా? లేక కువైత్‌లోని యజమానుల ఫిర్యాదులు సరైనవా? అనే విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం తెలుగువారు అక్కడ అనేక సమస్యల్లో చిక్కుకున్నారు. తమపై ఉన్న కేసుల్లో కనీసం ప్రాథమికంగా కూడా న్యాయ సహాయం, సూచనలు అందక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆమ్నెస్టీ సంస్థ అయినా తమను ఆదుకుంటుందేమోన్న ఆశతో దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారు. భారత ఎంబసీ అధికారులు తమ సమస్యలను పట్టించుకోవాలని, కేసుల్లో రాజీ లేదా సత్వర పరిష్కార మార్గాలు చూపాలని కోరుతున్నారు. ఆమ్నెస్టీ లేదా భారత దౌత్యాధికారులు సాయం చేస్తే స్వదేశానికి వెళ్లిపోతామని చెబుతున్నారు.