:: Welcome to NRI - Article ::

కిమ్‌ను అంతమొందించేందుకు పక్కా ప్లాన్..

సియోల్: ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌ను హత్య చేసేందుకు దక్షిణకొరియా పక్కా ప్రణాళిక రచిస్తోంది. అధిక తీవ్రత గల అణుబాంబుని పరీక్షించి అమెరికా, దక్షిణకొరియా, జపాన్‌లకు ప్రమాదకరంగా పరిణమించిన కిమ్‌ను అంతమొందించడమే ఉత్తమమని భావించిన దక్షిణకొరియా నాయకత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. వ్యూహం ప్రకారం ఓ ప్రత్యేక దళానికి శిక్షణ ఇవ్వనుంది. రాత్రివేళల్లో చొరబడి ఉత్తరకొరియా అధినాయకత్వాన్ని, ముఖ్యంగా కిమ్ జాంగ్ ఉన్‌ను చంపే విధంగా ఈ దళానికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ దళానికి ‘స్పార్టన్ 3000’ అని పేరు పెట్టారు. ఈ సంవత్సరం చివరికల్లా దళాన్ని సిద్ధం చేయాలని భావిస్తున్నామని దక్షిణకొరియా రక్షణశాఖా మంత్రి సాంగ్ యంగ్ మూ పేర్కొన్నారు. దక్షిణకొరియాపై ఉత్తరకొరియా యుద్ధం మొదలుపెట్టిన అనంతరం, లేదా యుద్ధం మధ్యలో ఈ దళాలను ఉత్తరకొరియాలోకి పంపించనున్నామని పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 4న చట్టసభ సభ్యులతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ఆయన తెలిపారు. కిమ్‌ను అంతమొందించే ఓ ప్రత్యేక దళాన్ని 2019 చివరికల్లా సిద్ధం చేయాలని దక్షిణకొరియా మాజీ అధ్యక్షుడు హౌకిస్ పార్క్ గున్‌హై ఓ ప్రణాళికను ప్రతిపాదించారు. కానీ ప్రస్తుత ప్రమాద పరిస్థితుల తీవ్రత దృష్ట్యా ఈ సంవత్సరం చివరినాటికి దళాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించారు. 

 
ఉత్తరకొరియా నుంచి అణుదాడి ప్రమాదం ఉన్న నేపథ్యంలో దక్షిణకొరియాపై అమెరికా ఒత్తిడి పెంచివుంటుందని, దీంతో దక్షిణకొరియా ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని కొరియన్ ఎకనామిక్ ఇన్‌స్టీట్యూట్ నిపుణుడు ట్రాయ్ స్టాంగారోనే అభిప్రాయపడ్డారు.