Smugglers-using-Samshabad-for-transport-gold

శంషాబాద్‌.. స్మగ్లర్లకు ‘బంగారం’

 

పసిడి అక్రమ రవాణాకు అడ్డాగా విమానాశ్రయం..
ఒకేరోజు పట్టుబడిన మూడు ముఠాలు
నాలుగున్నర కిలోల స్వర్ణం స్వాధీనం
ఉద్యోగాల పేరుతో యువతను దుబాయ్‌కు రప్పించి స్మగ్లింగ్‌
ఎయిర్‌పోర్టులో పనిచేసే కూలీలకూ ప్రమేయం
 
శంషాబాద్‌, హైదరాబాద్, మే 13: వారు ప్రయాణికులు కాని ప్రయాణికులు! బెరుకు కనబడనీయరు. విమానంలోంచి దర్జాగా దిగుతారు. వెంట తీసుకొచ్చే ఇంతింత లగేజీలోనే ఉంటుంది ‘విషయమంతా’! మరి.. వారిలో అధికారుల తనిఖీల్లో పట్టుబడుతున్నవారెందురు? తప్పించుకుంటున్నవారెందరు? తెలియదు గానీ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడడం నిత్యకృత్యమైపోయింది. దేశంలోని గొప్ప విమానాశ్రయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ ఎయిర్‌పోర్టు.. బంగారం స్మగర్లకు అడ్డాగా మారింది. ఇటీవల ఒకేరోజు ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌, కస్టమ్స్‌, ఎస్‌వోటీ బృందాలు నిర్వహించిన సంయుక్త దాడుల్లో ఏడుగురు స్మగ్లర్లు పట్టుబడ్డారు. వేర్వేరు ముఠాలకు చెందిన ఈ నిందితుల నుంచి నాలుగున్నర కిలోల బంగారం లభ్యమైంది. ఈమేరకు చేపట్టిన దర్యాప్తులో బంగారం స్మగ్లింగ్‌ కోసం యువకులను ఎర వేస్తున్నారనే విషయం వెల్లడైంది. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి యువకులను దుబాయ్‌కి పిలిపించుకుంటున్న స్మగ్లర్లు.. అక్కడ వారికి బంగారం స్మగ్లింగ్‌పై శిక్షణ ఇస్తున్నట్లు తేలింది. విమానాశ్రయంలోని రెడ్‌చానల్‌, గ్రీన్‌చానల్‌లో జరగుతున్న తనిఖీలపై స్మగ్లర్లకు పూర్తి అవగాహన ఉందని ఇటీవలి ఘటనలు నిరూపించాయి. సాధారణంగా విదేశాల నుంచి లగేజీ తెచ్చేవారు రెడ్‌చానల్‌ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. మామూలుగా ఒక బ్యాగుతో వచ్చేవారు మాత్రం గ్రీన్‌చానల్‌ నుంచి వెళ్లేందుకు అనుమతిస్తారు.
 
ఇటీవల దుబాయ్‌ నుంచి దిగిన ఓ మహిళ తన హ్యాండ్‌బ్యాగ్‌తో గ్రీన్‌ చానల్‌ నుంచి బయటకు వెళుతుండగా అధికారులు అనుమానించారు. ఆమె వద్ద ఉన్న బ్యాగును తెరిచిచూడగా.. పైకి కొన్ని బొమ్మలు, చాక్లెట్లు కనిపించాయి. బొమ్మలను భాగాలుగా చేసి పరిశీలిస్తే.. 640 గ్రాముల బంగారు రేకులు బయటపడ్డాయి. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు విమానాశ్రయంలోనే ఆరుగురు నిందితులను పట్టుకోగా, వీరిలో కొందరు ఎయిర్‌పోర్టులో పనిచేసే కార్మికులని తెలిసింది. నిందితులను విచారిస్తే..విస్తుగొలిపే అంశాలు వెలుగుచూసినట్టు సమాచారం. విమానాశ్రయానికి వివిధ దేశాల నుంచి వచ్చిన బంగారాన్నంతా ఓ చోట పోగేస్తారు. ఇందుకు ఎయిర్‌పోర్టు సమీపంలోని లాడ్జిలనే అడ్డాలుగా చేసుకుంటారు. వాట్సాప్‌ ద్వారా ముఠా సభ్యుల ఆదేశానుసారం బంగారాన్ని రహస్యంగా ముంబై చేరవేస్తున్నట్టు తెలిసింది.
 
మరో మూఠానేమో.. శంషాబాద్‌ నుంచి కేరళ మీదుగా దుబాయ్‌కి తరలిస్తున్నట్లు తెలిసింది. తమ దందా కోసం ఎయిర్‌పోర్టులోని ఉద్యోగులకు స్మగ్లర్లు ఎరవేస్తున్నట్టు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం ఎయిర్‌పోర్టులోని ఓ విభాగంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు బంగారం రవాణా కేసులో పట్టుబడ్డారన్న చర్చ సాగుతోంది. వారం క్రితం దుబాయ్‌ నుంచి దిగిన ఓ ప్రయాణికుడు ఇచ్చిన బ్యాగును ఇండిగోలో పనిచేసే ఓ ఉద్యోగి తీసుకొని దాన్ని చీకట్లోకి విసిరేశాడు. దీన్ని పసిగట్టిన కస్టమ్స్‌ సిబ్బంది ఆ ఉద్యోగిని పట్టుకొని విచారించారు. బ్యాగును తనిఖీ చేయగా అందులో దాదాపు 1600 గ్రాముల బంగారం పట్టుబడింది. బంగారం స్మగ్లింగ్‌లో ఎయిర్‌పోర్టులో పనిచేసే హౌస్‌కీపింగ్‌ ఉద్యోగుల పాత్ర కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ నెల 3వ తేదీన దుబాయ్‌ నుంచి వచ్చిన ఎయిర్‌ఇండియా విమానంలోని చెత్తను తనిఖీ చేయగా, 650 గ్రాముల బంగారం దొరికింది.