:: Welcome to NRI - Article ::

‘తమ్ముడు భారతీయ పౌరసత్వాని పొందాలని భావిస్తున్నాం’

దుబాయ్: సినిమాల్లో కన్నీళ్లు పెట్టించే దృశ్యాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో అక్కాతమ్ముడు కలుసుకున్నారు. 17 సంవత్సరాల క్రితం కుటుంబం నుంచి విడిపోయిన తమ్ముడిని కలుసుకున్న అక్క ఆనందానికి, తమ్ముడి కళ్లలోని సంతోషానికి అవధులే లేవు. సుధీర్ఘ కాలం తర్వాత ఉద్వేగభరిత క్షణాల మధ్య యూఏఈలోని షార్జాలో ఎయిర్‌పోర్టులో జూలై 27న ఇద్దరూ కలుసుకున్నారు. కేరళలో నివాసముంటున్న కుటుంబం నుంచి తండ్రి సుడాన్‌ జాతీయుడు విడిపోయాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కేవలం 4 సంవత్సరాల వయసున్న హని నాదీర్ మెర్గని అలీ అనే కొడుకుని వెంటపెట్టుకుని సుడాన్ వెళ్లాడు. దీంతో అమ్మ, ఇద్దరు అక్కల ప్రేమకు హనీ దూరమయ్యాడు. అలాగే 17 సంవత్సరాలు దూరంగా పెరిగాడు. 
 
వీరిద్దరి కలయిక అనంతరం అక్కాతమ్ముడు తమ ఆనందాన్ని పంచుకున్నారు. తమ్ముడు మాట్లాడుతూ.. ‘‘నేను చిన్న వయసులో ఉన్నప్పుడు సుడాన్ వెళ్దామని నాన్న చెపుతుండేవాడు. ఒకరోజు ఎవరికీ చెప్పకుండా నన్ను తీసుకుని వెళ్లాడు. తనతోపాటు నన్ను సుడాన్ తీసుకెళ్లాడు. నాన్న ప్రవర్తన అస్సలు బాగోలేదు. నన్ను ఎప్పుడూ కొడుతూనే ఉండేవాడు. అమ్మను చూడాలని ఉందని నేను అడుగుతూనే ఉండేవాడిని. కానీ నాకు అమ్మలేదని నాన్న చెపుతుండేవాడు’’ అని తన బాధను వర్ణించాడు.  
 
దుబాయ్ నగరంలోని కరామా ప్రాంతంలో ఓ స్టేషనరీ దుకాణంలో పనిచేస్తున్న హనీ అక్క సమీరా మాట్లాడుతూ.. ‘‘మా తమ్ముడు తన కథను ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టుచేశాడు. విషయం నాకు తెలియడంతో తమ్ముడితో మాట్లాడాను. తమ్ముడిని సుడాన్ నుంచి దుబాయ్ తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. హనిని తీసుకురావడానికి డబ్బు అవసరమవ్వడంతో స్నేహితులు, బంధువులు సహాయం చేశారు. తమ్ముడు భారతీయ పౌరసత్వం పొందాలని భావిస్తున్నాం. తమ్ముడిని ఇక సుడాన్ పంపించాలనుకోవడం లేదు. తమ్ముడు తన మిగతా జీవితాన్ని తల్లి, తోబుట్టువులతో గడపాలని కోరుకుంటున్నాం. అన్నింటికంటే ముందుగా దుబాయ్‌లో తమ్ముడికి ఒక ఉద్యోగం చూడాలి’’ అంటూ తన తమ్ముడి చేతులు తడుముతూ చెప్పింది. తాను ఎంత సంతోషంగా ఉన్నానో ఎవరూ అర్థం చేసుకోలేరని హని ఉద్వేగానికి గురయ్యాడు. మురిసిపోయిన అక్క.. తమ్ముడు  ఆనందాన్ని వ్యక్తం చేయలేకపోతున్నాడని తెలిపింది. ఇదిలావుండగా ఓ వ్యాపారవేత్త సహాయంతో షార్జా ఎయిర్‌పోర్టులో తల్లీకొడుకు కలుసుకున్న విషయం తెలిసిందే. యూఏఈలో ఈ వార్త సంచలమైంది. కుటుంబం కలుసున్న తీరుకి అనేకమంది సంతోషం వ్యక్తం చేశారు. కుటుంబానికి సహాయం చేసేందుకు కూడా పలువురు ముందుకొచ్చారు. ఖలీజ్ టైమ్స్ సౌజన్యంతో వీడియో చూడండి.