Sharjah-Police-save-girl-from-committing-suicide

12 ఏళ్ల బాలిక ఆత్మహత్యాయత్నం.. ఏం చేసిందంటే..

షార్జా, యూఏఈ: ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ 12 ఏళ్ల బాలిక అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి ఇరుగుపొరుగుతోపాటు పోలీసులను కూడా కంగారెత్తించింది. కానీ పోలీసుల కృషి వల్ల ఆమె ప్రాణాలతో బయటపడింది. యూఏఈలోని అల్ ధైడ్ ప్రాంతంలోని తన ఇంటి భవనం పైకెక్కిన బాలిక ఆత్మహత్యకు యత్నించింది. ఏడుస్తూ పైనుంచి కిందికి దూకాలని పలుమార్లు ప్రయత్నించింది. ఈ విషయాన్ని ముందుగానే గమనించిన  బాలిక స్నేహితులు ఇరుగుపొరుగువారికి విషయాన్ని తెలియజేశారు. దీంతో అందుబాటులో ఉన్నవారందరూ కలిసి ఇంటి చుట్టూ నిలబడ్డారు. బాలిక కిందికి దూకితే పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. పలు మెత్తనైన సామాగ్రిని కూడా సేకరించి సిద్ధంగా ఉంచారు. బాలిక రక్షించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. అయితే పోలీసులకు సమాచారం అందించడంతో కొద్దిసేపటి తర్వాత ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాలికకు తెలియకుండా తలుపులు బద్ధలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. విజయవంతంగా బాలికను రక్షించారు. ఘటన జరిగిన సమయంలో బాలిక తల్లి, సోదరుడు బయటకు వెళ్లగా వైద్య పరీక్షల నిమిత్తం తండ్రి వేరే దేశంలో ఉన్నట్లు తేలింది. ఆత్మహత్య యత్నానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, బాలిక తల్లిని అదుపులోకి  తీసుకుని ప్రశ్నించనున్నామని పోలీసులు తెలిపారు.