Sharjah-doctors-save-life-of-Indian

భారతీయుడి ప్రాణాలు కాపాడిన షార్జా వైద్యులు

షార్జా: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ భారతీయుడి ప్రాణాన్ని కాపాడిన షార్జా వైద్యులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వైద్యులు దేవుడితో సమానమని నిరూపించుకున్నారు. విజయ్ పాల రావు అనే తెలుగు వ్యక్తి షార్జా నగరంలో రోడ్డు పక్కన ఇసుకలో పడిపోయి ఉండడాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. దగ్గరకు వెళ్లి పరిశీలించగా అతడి దుర్భరపరిస్థితి వారికి అర్థమైంది. మతిస్థిమితం కోల్పోయి రోడ్ల వెంట తిరుగుతున్న వ్యక్తి అని తెలుసుకున్నారు. దుస్తులు ఉన్న ఓ బ్యాగును వెనుకాల తగిలించుకుని రోడ్లపై తిరుగుతున్నాడు. అతడి వద్ద ఉన్న పర్సులో చిల్లిగవ్వ కూడా లేదు. పర్సులో ఏవో కొన్ని పత్రాలు మాత్రమే ఉన్నాయి. 2014లో పర్యాటక వీసా ద్వారా యూఏఈ వచ్చినట్టు పత్రాల ద్వారా తెలిసింది. పూర్తిగా బక్కచిక్కిపోయిన విజయ్ పరిస్థితిని గుర్తించిన పోలీసులు చలించిపోయారు. సమీపంలో ఉన్న ఖ్వాస్సిమీ హాస్పిటల్‌కు తరలించారు.

వైద్య పరీక్ష నిర్వహించిన వైద్యులు పుట్టకతో వచ్చిన సమస్యల వల్ల విజయ్ మెదడులో రక్తం గడ్డకట్టిందని తేల్చారు. ప్రాణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో అదే హాస్పిటల్లో పనిచేస్తున్న డా. సతీష్ క్రిష్ణన్ అనే న్యూరోలాజికల్ సర్జన్ విజయ్‌కు శస్త్రచికిత్సను నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతమవ్వడంతో విజయ్ ప్రాణాలు దక్కాయి. శస్త్రచికిత్స అనంతరం విజయ్ రావు సరిగా మాట్లాడలేకపోతున్నాడు. జ్ఞాపకశక్తిని కూడా కోల్పోయాడు. అయితే మెల్లమెల్లగా మాట్లాడే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అక్కడున్న సిబ్బంది సహాయంతో విజయ్ రావుతో భారత్‌కు సంబంధించిన అనేక భాషల్లో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ తెలుగులో మాత్రం ప్రయత్నించలేదు. కొద్ది రోజుల తర్వాత విజయ్ రావు తెలుగు పదాలు పలుకుతున్నాడని గమనించి తెలుగు మాట్లాడే ఓ నర్సు సహాయంతో మాట్లాడించారు.అనంతరం విజయ్ రావుకు పరిస్థితిని ప్రచారం చేయగా గుర్తించిన ఓ కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఎట్టకేలకు విజయ్ రావు కుటుంబ సభ్యుల జాడ కనుక్కున్నారు. విజయ్ రావు సోదరుడు షార్జాలోని హాస్పిటల్‌కు చేరుకున్నాడు. సోదరుడి పరిస్థితి చూసి ఆవేదనకు గురయ్యాడు. త్వరలోనే వారు స్వస్థలానికి చేరుకోనున్నారు. శస్త్రచికిత్స విజయవంతంగా జరగడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. దేవుడికి ధన్యవాదాలు అని వైద్యుడు క్రిష్ణన్ అన్నారు. ఇంటికి పంపించే ముందు హాస్పిటల్ మెడికల్ బిల్లు 80 వేల దిర్హమ్స్(దాదాపు రూ.16 లక్షలు) మాఫీ చేస్తున్నామని యాజమాన్యం ప్రకటించింది.