Sharath-murderer-died-in-us-police-shooting

పాపం పండింది..శరత్‌ కర్మ రోజే ఆగంతకుడు ఖతం..

క్యాన్సస్‌ ఎదురు కాల్పుల్లో హతం..
ముగ్గురు పోలీసులకు గాయాలు
 
వాషింగ్టన్‌, జూలై 16: అమెరికాలో హత్యకు గురైన తెలంగాణ విద్యార్థి కొప్పు శరత్‌(25) దశదిన కర్మరోజే ఆయన హంతకుడిని పోలీసులు మట్టుబెట్టారు. దాంతో బాధిత కుటుంబానికి కొంతలో కొంత సాంత్వన చేకూరినట్లయింది. శరత్‌ను కాల్చిచంపిన హంతకుడిని క్యాన్సస్‌ పోలీసులు ఆదివారం రాత్రి హతమార్చారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. శరత్‌ హంతకుడి పేరును పోలీసులు వెల్లడించడం లేదు. ఈ నెల 6న ఓ రెస్టారెంట్లో శరత్‌ అతని మిత్రులు పని చేస్తుండగా, తుపాకీ పట్టుకొన్న దుండగుడు లోపలికి ప్రవేశించాడు. అడిగిన వెంటనే శరత్‌ కౌంటర్‌లోని డబ్బులు ఇవ్వకపోవడంతో దుండగుడు అతనిపై కాల్పులు జరిపాడు. శరత్‌ రెండు బుల్లెట్లు తగిలి అక్కడికక్కడే మరణించారు. ఆ రోజు నుంచి పరారీలో ఉన్న దుండగుడికి సంబంధించిన వీడియో ఫూటేజీని పోలీసులు విడుదల చేశారు. ఆ తర్వాత నగరమంతా గాలింపులు మొదలెట్టారు. కొంత సమాచారం దొరికింది. దాని ఆధారంగా అండర్‌ కవర్‌ పోలీసులు దుండగుడిని వెంటాడటం మొదలెట్టారు. ఒక మోటెల్‌ వద్ద ఇద్దరు పోలీసులు దుండగుడిని ఆపేందుకు ప్రయత్నించారు. దాంతో అతడు వారిద్దరిపై కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత పలుమార్లు పోలీసులకు, దుండగుడికి మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మరో పోలీసు గాయపడగా, దుండగుడు మరణించాడు. వేగంగా స్పందించి, శరత్‌ కేసును కొలిక్కి తెచ్చిన పోలీసులకు క్యాన్సస్‌ నగర భారతీయ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. శరత్‌ హంతకుడి మరణవార్త విని పాపం పండిందని బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.
 
చావుకు చావే పరిష్కారం కాదు
హంతకుడిని అమెరికా ప్రభుత్వం ఎన్‌కౌంటర్‌ చేసింది. చావుకు చావే పరిష్కారం కాదు. హంతకుడిని చట్టం ముందు నిలబెట్టాల్సింది. అప్పుడే అతనికి మా బాధ ఏంటో తెలిసేది. అమెరికా చట్టాలలో మార్పులు రావాలి. మున్ముందు శరత్‌లాగా ఏ అన్నయ్యా బలికాకూడదు.- అక్షర, శరత్‌ చెల్లి
 
సీసీ ఫూటేజీని విడుదల చేయాలి
హంతకుడికి తగిన శాస్తి జరిగింది. నా కొడుకు తిరిగి రాడు. దశదిన కర్మ రోజే హంతకుడిని అంతమొందించడంతో శరత్‌ ఆత్మకు శాంతి చేకూరుతుందని భావిస్తున్నాను. శరత్‌ పని చేస్తున్న హోటల్‌లో 30 డాలర్ల బిల్‌ కట్టమని అడిగితే హంతకుడు తుపాకీతో కాల్చాడని ఒక కథనం ఉండగా, క్యాష్‌ కౌంటర్‌లో ఉన్న డబ్బును బయటికి తీసి అందించలేక పోవడంతో హంతకుడు కాల్పులు జరిపాడన్నది మరొక కథనం వినిపిస్తుంది. సీసీ ఫూటేజీని విడుదల చేస్తే భవిష్యత్‌ తరాలకు అక్కడ ఎలా మసలుకోవాలో తెలుస్తుంది.
- రాంమోహన్‌, శరత్‌ తండ్రి