Sensational-decision-by-Abu-Dhabi-Government

అబుధాబీ కోర్టుల్లో ఇక హిందీ

మూడో అధికార భాషగా గుర్తింపు

కేసులున్న వలస జీవులకు ఊరట

దుబాయ్‌, ఫిబ్రవరి 10: కేసుల్లో ఇరుక్కున్న వలస జీవులకు ఊరట కలిగించేలా అబుధాబీ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అబుధాబీ కోర్టుల్లో అరబీ, ఆంగ్ల భాషల్లోనే విచారణ కొనసాగేది. విచారణ సందర్భంగా తమపై ఏమేం అభియోగాలు చేస్తున్నారో అర్థం కాక, తలాడించడం మినహా వలసజీవులకు మరో మార్గం ఉండేది కాదు. తాజాగా కార్మికుల కేసుల్లో కోర్టు విచారణకు మూడో అధికారిక భాషగా హిందీకి గుర్తింపు ఇస్తూ న్యాయశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. హిందీ మాట్లాడేవారికి కోర్టు విచారణ , వారి హక్కులు, విధులు సులభంగా అర్థమయ్యేందుకు ఈ నిర్ణయం దోహదం చేయనుంది. అధికారిక లెక్కల ప్రకారం యూఏఈ(యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌) జనాభా సుమారు 50 లక్షలు. ఇందులో ఇతర దేశాల నుంచి వలసవచ్చినవారు 2/3 వంతు ఉన్నారు. అందులో 30 శాతం మంది భారతీయులే.