Saudi-woman-discovers-husband-lied-

పెళ్లైన 15 ఏళ్లకు సౌదీ మహిళకు షాక్..

రియాద్: సౌదీఅరేబియాకు చెందిన ఓ మహిళ తన భర్తకు సంబంధించిన అసలు విషయం తెలుసుకుని షాక్‌కు గురైంది. పెళ్లైన 15 సంవత్సరాల తర్వాత ఈ నిజం తెలిసింది. సౌదీ పౌరుడినని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాడని ఆలస్యంగా తెలుసుకున్న మహిళ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఓ వ్యక్తి తన కుటుంబంతో ఏడు సంవత్సరాల వయసులో తన కుటుంబంతోపాటు సౌదీ వెళ్లాడు. సౌదీ పౌరుడైన తన బావ పౌరసత్వ గుర్తింపు కార్డును దొంగిలించాడు. ఈ కార్డు ఆధారంగా సౌదీ పౌరుడిగా నకిలీ గుర్తింపు కార్డును సృష్టించాడు. సౌదీ పౌరుడినని ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు. సౌదీ ఆచారాలు సంప్రదాయల గురించి చులకనగా మాట్లాడడం, పట్టించుకోకపోవడంతో భార్యకు అనుమానం వచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకోగా సౌదీ పౌరుడు కాదని తేలింది. నిజం తెలిసిన వెంటనే పోలీసులకు తన భర్త గురించి ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై కోర్టులో విచారణ జరగగా నేరం రుజువైంది. నిందితుడికి 7 నెలల జైలుశిక్ష, 3000 రియాల్స్‌ను జరిమానాగా విధించింది. సౌదీ చట్టాల ప్రకారం ఓ మహిళ విదేశీయులను పెళ్లి చేసుకుంటే పిల్లలకు సౌదీ పౌరుసత్వం లభించదు. దీంతో అధికారులు వారి పిల్లల పౌరుసత్వాన్ని తొలగించే పనిలో ఉన్నారు. నిందితుడు ఏ దేశానికి చెందిన పౌరుడు అనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు ఏమనుకున్నా తాను పట్టించుకోనని, అబద్ధం చెప్పి తనను పెళ్లి చేసుకున్నాడని, అందుకే కేసుపెట్టానని మహిళ చెపుతోంది.