:: Welcome to NRI - Article ::

నిమిషాల్లో పెళ్లనగా ఆగిపోయింది..కారణం తెలిస్తే నమ్మలేరు

రియాద్: కొన్ని నిమిషాల్లో పెళ్లి జరుగుతుందనగా ఆగిపోయింది. కట్నం తక్కువైందనో, అమ్మాయి నచ్చలేదనో, అబ్బాయి మంచివాడుకాదనో.. పెళ్లి ఆగిందనుకుంటే పొరపాటు పడినట్లు. కాబోయే అల్లుడిని మామ అడిగిన చిన్న కోరికే పెళ్లి ఆగిపోవడానికి కారణమయ్యింది. ఎవరు చెప్పినా వినకుండా పెళ్లి కొడుకు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మహిళ చిరు కోరికకు ఎదురైన పరాభవానికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పెళ్లైన తర్వాత తన కూతురిని కారు డ్రైవింగ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఓ వధువు తండ్రి.. కాబోయే అల్లుడిని కోరాడు. ఈ ఒక్క కారణం ఆ పెళ్లి ఆగిపోవడానికి కారణమైంది. తన భార్య కారు నడపడానికి ఏమాత్రం అనుమతి ఇవ్వనని చెప్పాడు. ఎవరు చెప్పినా వినలేదు. పెళ్లి వద్దంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు సౌదీకి చెందిన యువకుడు. దారుణమైన ఈ ఘటన సౌదీఅరేబియాలో జరిగింది. మహిళలు డ్రైవింగ్ చేయవచ్చంటూ సౌదీ రాజు సాల్మాన్ గర్వంగా ప్రకటించిన కొద్దిరోజుల్లోనే ఈ ఘటన వెలుగులోకి రావడం శోచనీయం. సౌదీలోని మహిళలు చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, బయటకు వెళ్లాలన్నా వారి సంరక్షల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలనే చట్టం అమల్లో ఉంది. దీంతో తన భార్య కారు డ్రైవింగ్ చేసేందుకు అనుమతి ఇవ్వనని వరుడు చెప్పడంతో ఈ పెళ్లి ఆగిపోయింది.

 
ఇదిలావుండగా.. మహిళలు డ్రైవింగ్ చేయకూడదని నిబంధన కలిగివున్న ఏకైక దేశం ఏదని ప్రశ్నిస్తే ఒకప్పుడు సౌదీఅరేబియా పేరు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. సౌదీ రాజు సాల్మాన్ చరిత్రాత్మక నిర్ణయాన్ని వెల్లడించారు. మహిళలు డ్రైవింగ్ చేయడానికి అనుమతి ఇస్తున్నామని గర్వంగా ప్రకటించారు. 2018 జూన్ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఈ ప్రటకనతో సౌదీ మహిళలు సంబరాల్లో మునిగారు. అంతర్జాతీయంగా సౌదీకి ప్రశంసలు అందాయి. నిర్ణయంపై అంతర్జాతీయ హక్కుల సంస్థలు అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళ కారు డ్రైవింగ్ చేస్తానంటే ఒప్పుకోకపోవడమే కాకుండా పెళ్లి రద్దైన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని అరబిక్ డైలీ అల్-మార్షద్ వెల్లడించింది.