Saudi-Crown-Prince-coming-to-India

భారత్‌కు రానున్న సౌదీ యువరాజు.. డేట్ ఫిక్స్

న్యూఢిల్లీ: సౌదీలో పాత వాసనలు తొలగించి కొత్త తరానికి రాచబాట వేయాలనే ఉత్సాహంతో కొత్త కొత్త చట్టసవరణలు చేసి.. ఆ దేశానికి ప్రపంచంలో ఉన్న పేరు ప్రఖ్యాతులను మరింతగా ఇనుమడింపజేస్తున్న ప్రస్తుత యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ తొలి భారత పర్యటన ఖరారైంది. ఆయన ఈ నెల 20న భారత్‌ను సందర్శించనున్నారని అధికారులు అంటున్నారు. ఇటువంటి పర్యటనలకు సంబంధించి కొన్ని నియమనిబంధనలు పాటించాలని వాటిని తూచా తప్పకుండా అమలుచేస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో ఆయిల్ ఎగుమతిదారుల్లో ప్రధానమైన సౌదీతో భారత్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. 2014లో రక్షణ విషయంలో కూడా ఈ రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరాన్, వెనెజులా నుంచి దిగుమతులు తీసుకునే దేశాలపై అమెరికా ఆంక్షలు విధించడంతో చాలా దేశాలకు సౌదీనే పెద్ద దిక్కయింది. ఎందుకంటే ఇరాన్, సౌదీలు మాత్రమే ప్రపంచానికి కావలసిన చమురు నిల్వల్లో 90శాతంపైగా అందుతున్నాయి. వీటిలో కూడా సింహభాగం సౌదీనుంచే ఎగుమతి అవుతోంది. భారత్ నుంచి అధికశాతం వలసలు కూడా సౌదీకే వెళ్తారు. అక్కడి చమురు కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఏటా కొన్ని వేల మంది భారతీయులు సౌదీ గుమ్మం తొక్కుతారు. ప్రస్తుతం సౌదీ చమురు సంస్థల్లో పనిచేస్తున్న విదేశీయుల్లో అత్యధికులు భారతీయులే అనడం అతిశయోక్తి కాదు. అందుకే సౌదీతో సంబంధాలను బలపరచుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోంది.