saudi-advisory-council-made-new-regulations-to-control-child-marriages

సౌదీ వివాహ చట్టంలో కొత్త మార్పులు

సౌదీ అరేబియా: సౌదీ ప్రభుత్వ సలహా మండలి సౌదీ అరేబియా షురా కౌన్సిల్ బాల్య వివాహాలకు సంబంధించిన వివాహ చట్టంలో కొత్త మార్పులను తీసుకొచ్చింది. 15 ఏళ్ల కంటే చిన్న వయసుగల అమ్మాయిలకు వివాహం చేయడాన్ని నిషేదిస్తూ కౌన్సిల్ సభ్యలు ఓటు వేశారు. 15 నుంచి 18 వయసు గల అమ్మాయిల వివాహాల విషయంలో కూడా కొన్ని మినహాయింపులు తయారుచేయనున్నట్టు కౌన్సిల్ సభ్యులు ట్విటర్‌లో తెలిపారు. సభ్యులందరూ ఈ మార్పుని హర్షధ్వానాలతో స్వాగతించి, ఇందులో సాయపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం శుభపరిణామయంటూ లతీఫా అనే మహిళా కౌన్సిల్ మెంబర్ చెప్పారు. 18 ఏళ్లు నిండకుండా జరుగుతున్న బాల్యవివాహాలను ఆపడమే తమ చట్టం చేస్తున్న ప్రయత్నమని అన్నారు. 

ఈ నిర్ణయాన్ని దాదాపు సౌదీలందరూ స్వాగతించారు. అయితే మానవ హక్కుల నిపుణులు ఇది కేవలం ప్రారంభమేనని, ఇంకా చేయాల్సింది చాలానే ఉందని అన్నారు. ఈ అడుగు మంచిదేనని, కాకపోతే పూర్తి స్థాయిలో బాల్యవివాహాలు ఆపడానికి ఈ నిర్ణయం ఒక్కటి సరిపోదని తెలిపారు. అదే విధంగా కేవలం చట్టాలతోనే మార్పు రాదని, మనుషుల వైఖరిలో ముందు మార్పురావాలని గర్ల్స్ నాట్ బ్రైడ్స్ ఆర్గనైజేషన్ డిప్యూటీ డైరెక్టర్ హ్యామిల్‌టన్ అన్నారు. ఆలోచనా విధానంలో మార్పు వస్తేనే బాల్యవివాహాలు తగ్గుతాయని, తల్లిదండ్రులు కూడా అమ్మాయిలకు మంచి చదువు చెప్పించాలని..అదే విధంగా ఎవరిని, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలన్న దానిపై అమ్మాయిలకు అవగాహన పెరిగేలా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. 

సౌదీయులందరూ ఈ చట్టాన్ని స్వాగతించినప్పటికీ..కొంతమంది మాత్రం వ్యతిరేకించారు. ఇష్టమైన వ్యక్తులను ఎన్నుకోవడంలో వయసుతో పనేంటని ట్వీట్లు చేశారు. వివాహం అంటే మంచి మనిషిని, మనసుకు నచ్చిన వాడిని చేసుకోవడమని, దీనికి వయసుతో సంబంధం లేదంటూ వాదించారు. కేవలం బాల్యవివాహాల నిషేధంతో ఏం జరగదని అన్నారు.