:: Welcome to NRI - Article ::

సిగ్గు..సిగ్గు..అమెరికాకు నిరసన వ్యక్తం చేసిన రష్యా

వాషింగ్టన్/మాస్కో: శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో ఉన్న రష్యా కాన్సులేట్ భవనంలోని రష్యా జాతీయ జెండాలు దొంగతనానికి గురవ్వడంపై రష్యా నిరసన వ్యక్తం చేసింది. రష్యా జెండాలు దొంగతనానికి గురవ్వడం సిగ్గుపడాల్సిన చర్యగా అమెరికాకు తన నిరసనను తెలియజేసింది. తమ జెండాలు వెతికిపట్టుకోవాలని అమెరికాను డిమాండ్ చేసింది. ఈ మేరకు రష్యన్ ఎంబసీ అధికారులు రష్యన్ భాషలో ఓ ట్వీట్ చేశారు. ఇరుదేశాల మధ్య ఏర్పడిన వివాదం అనంతరం  శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలోని రష్యా కాన్సులేట్ భవనాన్ని ఖాళీ చేయాలని అమెరికా డిమాండ్ చేసింది. ఈ ఆదేశాలతో రష్యా అధికారులు భవనాన్ని నెల రోజుల క్రితమే ఖాళీ చేశారు. కానీ కొంత సామాగ్రిని అక్కడే ఉంచారు. ఈ సామాగ్రిలోని రష్యా జాతీయ జెండాలు దొంగతనానికి గురయ్యాయని రష్యా ఆరోపిస్తోంది. రష్యా ఆరోపణలపై అమెరికా స్పందించాల్సి ఉంది. దీంతో ఇరుదేశాల మధ్య ఉన్న వివాదం మరోసారి బయటపడింది.