Rules-to-be-followed-at-Papal-Mass-venue

యూఏఈలో పోప్ ఫ్రాన్సిస్‌.. ఈ నిబంధనలు పాటించాల్సిందే

అబుదాబి: యూఏఈలోని క్రిస్టియన్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. వారి ఆధ్యాత్మిక గురువు, మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ తొలిసారి గల్ఫ్ దేశాల్లో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఫిబ్రవరి 3న యూఏఈలోని జాయెద్ స్పోర్ట్స్ పట్టణంలో నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొంటారు. యూఏఈలో సుమారు పది లక్షల మంది క్యాథలిక్‌లు ఉండగా, ఈ సమావేశంలో పాల్గొనే అదృష్టం మాత్రం కేవలం లక్షా ఇరవై వేల మందిని మాత్రమే వరించనుంది. వీరంతా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో సభా ప్రాంగణానికి వెళ్తారు. సొంతంగా వెళ్లాలనుకుంటే యాస్ దీవికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ వాహనాన్ని పార్క్ చేసి  అక్కడి నుంచి ప్రభుత్వం బస్సులోనే సభా ప్రాంగణానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ సమావేశానికి హాజరయ్యే వారు కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..

1. సమావేశానికి హాజరయ్యే వారికి ప్రభుత్వం ట్రాన్స్‌పోర్ట్ టెకెట్, ఎంట్రీ టికెట్ ఇస్తుంది. ఇవి ఉన్న వారినే బస్సులోకి ఎక్కనిస్తారు. కాబట్టి ఆ రెండూ తీసుకెళ్లడం మర్చిపోవద్దు.
2. రెండేళ్లు నిండిన పిల్లలకు కూడా ఈ టెకెట్లు ఉండాలి.
3. బస్సు ఎక్కేటప్పుడు తినుబండారాలు అనుమతిస్తారు. కానీ సభా ప్రాంగణంలోకి ఇవన్నీ నిషేధం. మంచినీళ్లు ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే.. సెక్యూరిటీ క్లియరెన్స్ తర్వాత వారి మందులు తెచ్చుకోవచ్చు.
4. సమావేశానికి హాజరయ్యే వారు కనీసం 3కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది. అలాగే 5గంటల పాటు సభా ప్రాంగణంలో ఉండాలి. సభ పూర్తవగానే ఫుడ్‌స్టాల్స్ అందుబాటులోకి వస్తాయి.
5. సభా ప్రాంగణంలోకి గొడుగులు, సెల్ఫీ స్టిక్స్ వంటివి నిషేధం. బయట కూర్చునే వారు మడత కుర్చీల వంటికి తెచ్చుకోవచ్చు.
6. ఇతర దేశాల నుంచి సమావేశానికి వచ్చే వారు దుబాయి లేదా అబుదాబిలో ఎంట్రీ టికెట్‌ తీసుకునేప్పుడే ట్రాన్స్‌పోర్ట్ టికెట్ కూడా తీసుకోవాలి.