rahul-said-this-after-visit-London-

'రాహుల్ లండన్ వెళ్ళాకే మాల్యా వ్యాఖ్యలు'

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లండన్ వెళ్ళిన తర్వాతే విజయ్ మాల్యా తాజా వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. బుధవారం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరైన విజయ్ మాల్యా తాను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడినట్లు తెలిపిన సంగతి తెలిసిందే. తాను బ్యాంకు రుణాల కేసు పరిష్కారం కోసం ఆఫర్లు చేసినట్లు మాల్యా చెప్పారు. దీనిపై జైట్లీ స్పందిస్తూ తాను వ్యక్తిగతంగా మాల్యాను కలవలేదని, ఒక రోజు పార్లమెంటులో హడావుడిగా మాల్యా తనను కలిశారని, బ్యాంకు రుణాల గురించి మాట్లాడబోగా తాను బ్యాంకర్లతోనే మాట్లాడుకోవాలని చెప్పానని ప్రకటించారు.

 
ఈ నేపథ్యంలో రవిశంకర్ ప్రసాద్ గురువారం మాట్లాడుతూ రాహుల్ గాంధీ లండన్ వెళ్ళిన తర్వాతే విజయ్ మాల్యా ఇటువంటి వ్యాఖ్యలు చేశారని అన్నారు. ‘‘మాల్యా చేస్తున్న కొత్త ఆరోపణలను గమనించారా? రాహుల్ గాంధీ లండన్ వెళ్ళిన తర్వాతే మాల్యా ఈవిధంగా మాట్లాడుతున్నారు. ఈ రెండిటికి ఏదైనా సంబంధం ఉందా? మీరు (మీడియా) కనుగొనాలి’’ అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. రాహుల్ గాంధీ గత నెలలో లండన్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఎంపీలు, విద్యార్థులు, భారత  సంతతివారితో ఆయన సమావేశాలను నిర్వహించారు.