Rahul-interacts-with-NRI's-in-Dubai

తుది శ్వాస వరకు ఎన్నారైలకు అండగా ఉంటా: రాహుల్ గాంధీ

యూఏఈ: రెండు రోజుల పర్యటనలో భాగంగా దుబాయ్ వెళ్లిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు ఐఎమ్‌టీ దుబాయ్ విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గురువారం రాత్రి దుబాయ్ చేరుకున్న రాహుల్ శుక్రవారం జెబెల్ అలీ ఇండస్ట్రియల్ ప్రాంతంలో పర్యటించారు. అక్కడ ఉన్న కార్మికులతో ఆయన ప్రసంగించారు. రాత్రికి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. భారతదేశం నేడు ఈ స్థాయిలో ఉందంటే.. అందులో ఎన్నారైల పాత్ర ఎంతో కీలకమని రాహుల్ అన్నారు. బ్రిటీష్ వారితో పోరాడే సమయంలో కూడా ఒక ఎన్నారైనే ఉద్యమాన్ని ముందుండి నడిపించారని..ఆయన మహాత్మా గాంధీ అంటూ గుర్తుచేశారు. భారతదేశానికి దూరంగా ఉంటున్న ప్రతి ఒక్క భారతీయుడి కోసం తాను బతికున్నంత వరకు తన తలుపులు, చెవులు, గుండె అన్నీ  తెరిచే ఉంటాయన్నారు. భారతీయులు ఏ చోట ఉన్నా..వారందరూ దేశం కోసం మరోసారి  కలవాల్సిన బాధ్యత వచ్చిందన్నారు. తాము చేసిందే ఒప్పు..మిగతా వారిది తప్పు అన్న మాటలతో ఇండియా లాంటి దేశం అభివృద్ధి చెందలేదని..ఈ రోజు రాజకీయ కారణాలతో దేశాన్ని అలానే మార్చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. 

భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో నిరుద్యోగం ఒకటని చెప్పారు. కేవలం నిరుద్యోగాన్ని లేకుండా చేయడమే కాకుండా..భారతదేశం చైనాతో కూడా పోటీ పడగలదని ప్రపంచానికి చాటిచెప్పాలన్నారు. ఐబీటీ విద్యార్థులు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచే రాహుల్ రాక కోసం వేచిచూశారు. రాహుల్ తమ ఇన్‌స్టిస్ట్యూట్‌కు రావడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు చెప్పారు. అనంతరం అక్కడకు చేరుకున్న రాహుల్.. విద్యార్థులతో సంభాషించారు. గల్ఫ్ మెడికల్ యూనివర్శిటీ విద్యార్థి మాట్లాడుతూ.. స్పెషల్ రిజర్వేషన్ కోటాలో భారతీయులతో పాటు తమకు కూడా సరైన హక్కులు ఉండేలా కృషి చేయాలని రాహుల్‌ను కోరాడు. దీనికి అంగీకరించిన రాహుల్..ప్రస్తుతం వ్యవస్థ అందరికీ సమానంగా లేదని, తప్పకుండా అందరికీ సమానమైన హక్కులను కల్పిస్తామని హామీ ఇచ్చారు.