:: Welcome to NRI - Article ::

గల్ఫ్ దేశాల్లో ప్రవాసీ దివస్ సంబరాలు

ఇద్దరు తెలుగు ప్రవాసీయులకు స్ధానిక పురస్కరాలు


ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి:గల్ఫ్ దేశాలన్నింటిలోనూ మంగళవారం సాయంత్రం ప్రవాసీ భారతీయ దివస్‌ను భారతీయ ఎంబసీలు,  కాన్సులేట్ల అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పెద్దసంఖ్యలో తెలుగు రాష్ట్రాల ప్రవాసీ ప్రముఖులు పాల్గొన్నారు. బెంగుళూరులో జరిగిన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేయడంతో పాటు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం విదేశాల్లో ఆపదలో ఇరుక్కోన్న ప్రవాసీయులకు అందిస్తున్న సహాయక కార్యక్రమాల విడియోలను కూడ ప్రదర్శించడం జరిగింది.
 
దుబాయిలో
 
దుబాయిలోని అల్ ఖోజ్ ప్రాంతంలో జరిగిన కార్యక్రమానికి ఉన్నత ఉద్యోగాలు చేసే వారితో పాటు కార్మికులు కూడా హాజరయ్యారు. భారతీయ కాన్సులేట్‌లో కాకుండా బహిరంగ ప్రదేశంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొనేందుకు వీలయింది. దుబాయిలోని ప్రవాసీ ప్రముఖుడు 1960 నుంచి నివాసముంటున్న సింధీ వ్యాపారి,  దుబాయిలోని కృష్ణ మందిరం నిర్వహకుడు వాసు షరఫ్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. బెంగుళూర్‌లో ప్రవాసీ సమ్మాన్ ఆవార్డుతో సత్కరించిన వీడియోను పెద్ద స్క్రీన్లలో ప్రసారం చేశారు. బెంగుళూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడానికి దుబాయిలోని తెలుగు ప్రవాసీ సామాజిక కార్యకర్తలు వి. అనురాధ, జనగాం శ్రీనివాస్ తదితరులు వెళ్లి వచ్చారు.  బెంగుళూరులో ప్రవాసీ దీవస్ దినోత్సవం సందర్భంగా 10 మంది తెలుగు వారికి ఉరి శిక్ష రద్దు విషయమై మంత్రి వీకే సింగ్‌తో జనగాం శ్రీనివాస్ చర్చించారు. 
 
జెద్ధాలో
 
భారీ నిర్మాణ సంస్ధలలో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయ కార్మికులకు ఆహార సామాగ్రి సరఫరా చేసి ఆదుకున్నందుకు ప్రవాసీ దివస్ సందర్భంగా జెద్ధాలోని ప్రవాసీ తెలుగు సంఘం (తాజ్) అధ్యక్షుడు మోహమ్మద్ యూసుఫ్, హైద్రాబాదీల ప్రవాసీ సంఘమైన ఖాకే తయ్యబా ప్రతినిధి ఇమ్రాన్ కౌసర్‌లను భారతీయ కాన్సుల్ జనరల్ నూర్ రహెమాన్ శేఖ్ సత్కరించారు, కార్యక్రమంలో సీనియర్ దౌత్యవేత్తలు ఆనందకుమార్, మోయిన్ ఆఖ్తర్ తదితరులు పాల్గొన్నారు.
 
రియాధ్‌లో
 
రియాధ్‌లో ఉప భారత రాయబారి హేమంత్ కోత్వాల్, సీనియర్ దౌత్యవేత్త అనిల్ నౌత్యాల్‌ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రవాస భారతీయుల పిల్లల విద్యాపరమైన ఇబ్బందులు, పరిష్కార మార్గాలు అనే కీలకాంశంపై దమ్మాంలోని హైద్రాబాద్ అసోసియెషన్ అధ్యక్షుడు జహీర్ బేగ్ ప్రసంగించారు. రియాధ్ నగరంలోని హైద్రాబాద్ ప్రముఖులు అనేకులు ఇందులో పాల్గొన్నారు. రియాధ్ నగరానికి చెందిన జీనత్ జాఫ్రీ అనే ప్రవాసీ మహిళను రాష్ట్రప్రతి ప్రవాసీ సమ్మాన్ ఆవార్డుతో సత్కరించారు. భారతీయులు తమ పిల్లలకు స్వేదేశీ విధానంలో విద్యభోదన లేక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా 1982లో జీనత్ జాఫ్రీ తన ఇంట్లో భారతీయుల పిల్లల కోసం ఒక గదిలో ప్రారంభించిన కమ్యూనిటీ పాఠశాల నేడు 10 వేల మంది విద్యార్ధుల కెపాసిటీకి చేరింది.
 
కువైత్‌లో
 
కువైత్‌లో జరిగిన కార్యక్రమంలో వివిధ బృందాల చర్చల్లో తెలుగు ప్రవాసీయులు ప్రముఖులు కోడూరి వెంకట్, వినయ్ ముత్యాల, గుంగుల మురళీధర్ రెడ్డి, కె.అనిల్ కుమార్, నర్సింగ రావు, అభయ్ పట్వారీలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రవాసీ దీవస్ సందర్భంగా మూడెళ్ళ క్రితం ఏర్పాటయిన అభయ స్వచ్చంధ సేవా సంస్ధ కూడా తన మూడో వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా భారతీయ ఎంబసీ అవరణలో ఘనంగా జరుపుకుంది.
 
బహ్రెయిన్‌లో
 
బహ్రెయిన్‌లోని భారతీయ ఎంబసీలో జరిగిన కార్యక్రమంలో ప్రవాసాంధ్ర తెలుగు ప్రముఖులు రఘునాథ్ బాబు, కార్మిక బంధువు డీవీ. శివకుమార్, ఏపీఎన్నార్టీ కోర్డినేటర్ హరిబాబు, మురళీధర్, వాసుదేవరావు పాల్గొన్నారు.

 

Loading...