PD-act-on-fake-gulf-agents

నకిలీ గల్ఫ్‌ ఏజెంట్లపై పీడీచట్టం

 

ఏజెంట్లు .. ఈ-మైగ్రేట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి
లేదంటే కఠిన చర్యలు తప్పవు: మంత్రులు కేటీఆర్‌, నాయిని
ప్రవాసీ సమస్యలపై అధికారులతో సమీక్ష
 
హైదరాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): బతుకుదెరువు కోసం గల్ఫ్‌ తదితర దేశాలకు వెళ్లేవారిని పదే పదే మోసం చేసే నకిలీ ఏజెంట్లపై పీడీ చట్టం నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు మంత్రులు కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. విదేశాలకు ఉపాధి కోసం వలసవెళ్లే కార్మికుల సంక్షేమం, పాస్‌ పోర్టుల ఇప్పించే ఏజెంట్ల వ్యవహారంపై శనివారం ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కేటీఆర్‌ విలేకరులతో మాట్లాడుతూ నకిలీ ఏజెంట్లను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గల్ఫ్‌లో ఉపాధి కోసం కార్మికులను పంపేందుకు ఏర్పాట్లు చేసే ఏజెంట్లు నెల రోజుల్లో నిర్ధేశించిన వివరాలను ఈ-మైగ్రేట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలన్నారు. లేదంటే వారిని అక్రమ ఏజెంట్లుగా గుర్తిస్తూ.. క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నకిలీ ఏజెంట్లను గుర్తించేందుకు త్వరలోనే పోలీసులు మార్గదర్శకాలను రూపొందిస్తారని వివరించారు. విదేశీ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ‘సురక్షితంగా వెళ్లండి..! సుశిక్షితులై వెళ్లండి..!’ అనే నినాదానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వ టాం కంపెనీ ద్వారా చట్టపరంగా విదేశాలకు వెళ్లాల కేటీఆర్‌ సూచించారు.
 
ఫిబ్రవరిలో విదేశీ భవన్‌
రాజధాని నగరంలో విదేశీ భవన్‌కు ఫిబ్రవరి రెండో వారంలో శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, ఎన్నారై శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కేంద్ర -రాష్ట్రప్రభుత్వాలు ఎన్నారైలకు, వలస కార్మికుల కోసం చేపడుతున్న చర్యలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేసేలా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించామన్నారు. ఈ విషయంలో రాష్ట్ర పోలీస్‌ శాఖ కొంతకాలంగా తీసుకుంటున్న చర్యలను మంత్రి అభినందించారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో మైనారిటీల సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, ఎన్నారై, పోలీస్‌ శాఖలు సంయుక్తంగా బృందాలు ఏర్పాటు చేసుకుని కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఏజెంట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఈ మేరకు పాస్‌పోర్టు కార్యాలయ అధికారులు సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో డీజీపీ మహేందర్‌రెడ్డి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్‌ త్రివేది, ఎన్నారై, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.