number-of-indians-increasing-for-get-green-card-visas-

గ్రీన్‌కార్డ్ వీసా కోసం ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో తమతోపాటు పిల్లల భవిష్యత్ కోసం ఆలోచిస్తున్న అనేకమంది వలసజీవులు గ్రీన్‌కార్డ్ వీసా, ఈబీ-5 వీసా కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో అనేకమంది ధనవంతులు, వ్యాపారవేత్తలు, పెద్దపెద్ద కంపెనీల్లో కీలకస్థానాల్లో పనిచేస్తున్న వలసజీవులు అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలతో యూఎస్ ఈబీ-5, గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేస్తున్న ప్రవాస భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గత మూడు దశాబ్ధాలుగా ఈ సంఖ్య పెరుగుతూనే ఉందని నిపుణులు చెబుతున్నారు. 

 ఈబీ-5 వీసా కోసం ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం 5 లక్షల డాలర్లను పెట్టుబడి పెట్టి కనీసం 10 మందికి ఉద్యోగం కల్పించగలిగితే చాలు. కానీ ఈ నిబంధనలను మార్చాలంటూ, పూర్తిగా తొలగించాలంటూ పలువురు చట్టసభ్యులు పదేపదే డిమాండ్ చేస్తున్నప్పటికీ దరఖాస్తుదారుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదని గణంకాలు చెబుతున్నాయి. 
 
ఈబీ-5 వీసా కోసం దరఖాస్తు చేస్తున్న భారతీయుల సంఖ్య ఏడాదికి 30-35 శాతం పెరుగుతోందని, అమెరికా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సహాయం చేసే ‘ఏవీజీ అమెరికా’ అనే కంపెనీ ముఖ్య అధికారి ఆరోన్ హోక్ ఇంటర్వూలో పేర్కొన్నారు. ‘‘ అమెరికా, చైనా మధ్య దాదాపు 95 శాతం పోటీ ఉండేది. కానీ ఇటీవలి కాలంలో అనేక దేశాల్లో పరిస్థితి మారింది. పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సంఖ్య భారత్‌లో కూడా అనూహ్యంగా పెరిగిపోయింది.’’ అని ఎల్‌సీఆర్ కేపిటలర్ పార్టనర్స్ సహఅధ్యక్షుడు షెర్మన్ బాల్డ్‌విన్ పేర్కొన్నారు. గతేడాది ఈబీ-5 వీసా కోసం అందిన మొత్తం 10 వేల దరఖాస్తుల్లో 500 దరఖాస్తులు భారతీయులవే కావడం గమనార్హం. చైనా, వియత్నాం, దక్షిణకొరియా, బ్రెజిల్ తర్వాత భారత్ ఐదవ స్థానంలో ఉంది. కానీ ప్రస్తుతం పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.