NRIs-shoud-register-their-marriages-in-india-says-experts

‘ఎన్ఆర్ఐల పెళ్లిళ్ల నమోదుకు ఆధార్ తప్పనిసరి చేయాలి’

న్యూఢిల్లీ: ప్రవాస భారతీయుల వివాహాలను భారతదేశంలో నమోదు చేయించేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేయాలని నిపుణులు సలహా ఇచ్చారు. వివాహ సంబంధ వివాదాల పరిష్కారానికి ఇది దోహదపడుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల కమిటీ తెలిపింది. ఇండియన్ పాస్‌పోర్టు హోల్డర్స్ భారతదేశంలో పెళ్లి చేసుకుంటుండటంపై ఈ నిపుణుల కమిటీ ఏర్పాటైంది.
 
ఎన్ఆర్ఐ భర్తలు తమ భార్యలను వదిలేయడం, వరకట్నం కోసం వేధించడం, గృహహింసకు గురిచేయడం వంటి వివాదాలను పరిష్కరించేందుకు వారి వివాహాల నమోదుకు ఆధార్‌ అనుసంధానాన్ని తప్పనిసరి చేయాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. గత నెల 30న దీనికి సంబంధించిన నివేదికను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించినట్లు తెలుస్తోంది.
 
ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్‌లకు ఆధార్ నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కృషి చేస్తోంది. ప్రస్తుతం భారతీయులు, చెల్లుబాటయ్యే వీసాలు ఉన్న విదేశీయులు ఆధార్ సంఖ్య కోసం నమోదు చేసుకోవచ్చు. విదేశాల్లో ఉన్న నేరస్థులను మన దేశానికి అప్పగించాలని కోరేందుకు ఉపయోగపడే ఒప్పందాలను సవరించాలని కూడా ఈ కమిటీ సిఫారసు చేసింది. గృహ హింస నిందితుడిని కస్టడీకి కోరేందుకు అవకాశం ఉండేవిధంగా సవరించాలని తెలిపింది.