:: Welcome to NRI - Article ::

భార్యాబిడ్డలను వదిలించుకున్న ఎన్నారై

అర్ధరాత్రి ఎయిర్‌పోర్టులో వదిలేసి.. 

అమెరికాకు ఒక్కడే పలాయనం 
హిమాయత్‌నగర్‌ / హైదరాబాద్‌, ఫిబ్రవరి 16: కట్టుకున్న భార్యను.. కన్నకొడుకును.. అమెరికా నుంచి తీసుకొచ్చి అర్ధరాత్రి వేళ ఎయిర్‌పోర్టులో వదిలేసి.. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడో ప్రబుద్ధుడు! భర్త నిర్వాకంతో.. ఒళ్లో ఆరునెలల చిన్నారిని పెట్టుకుని కన్నీరుమున్నీరైందా భార్య. భర్త తనకు చేసిన అన్యాయం, అతడి అకృత్యాల గురించి.. ఇక్కడి బాలల హక్కుల సంఘంలో నిర్వహించిన సమావేశంలో మీడియా దృష్టికి తీసుకొచ్చింది. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన శిరీషకు రామంతాపూర్‌కు చెందిన యాలాల కీర్తిసాయిరెడ్డితో 2015లో పెళ్లయింది. అప్పటికే అతడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లయిన పదిరోజులకు భార్యను కూడా అమెరికాకు తీసుకెళ్లాడు. అక్కడికి తీసుకెళ్లిన 2 నెలలపాటు బాగానే ఉన్నాడని.. ఆ తర్వాత నుంచి తనను వేధించడం ప్రారంభించాడని శిరీష ఆవేదన వెలిబుచ్చింది. సరిగ్గా తిండి కూడా పెట్టేవాడు కాదని.. తన కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడనిచ్చేవాడు కాదని.. ఇంకా రకరకాల చర్యలతో మానసికంగా వేధించేవాడని పేర్కొంది. గత ఏడాది జూలైలో తమకు బాబు పుట్టాడని.. అప్పుడైనా తనను బాగా చూసుకుంటాడనుకుంటే నిరాశే ఎదురైందని వివరించింది. పసిబిడ్డకు పాలుపట్టకుండా అడ్డుకోవడం వంటి వేధింపులకు పాల్పడడంతో తాను పుట్టింటి వారికి గోడు చెప్పుకున్నానని, అయితే వారికి ఫోన్‌ చేస్తున్నాననే కోపంతో ఫోన్‌ కూడా దగ్గర ఉండకుండా నిత్యం వేధింపులతో నరకయాతనకు గురిచేశాడని శిరీష కన్నీటిపర్యంతమయింది. లక్షల విలువైన నగలు, నగదు, స్థలాలు కట్నంగా ఇచ్చినప్పటికీ ‘పుట్టింటి నుంచిఏమీ తేకుండా మా ఇంటికొచ్చి తినేస్తున్నావు..’ అంటూ సూటిపోటి మాటలతో నరకం చూపించాడని వాపోయింది. తన అత్త ప్రోద్బలంతోనే భర్త ఇలా తనను వేధింపులకు గురిచేస్తున్నాడని శిరీష ఆవేదన వ్యక్తం చేసింది.