NRI-found-dead-in-hotel

హోటల్ గదిలో ఎన్నారై అనుమానాస్పద మృతి

చంఢీగడ్: సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న ఓ ఎన్నారై చంఢీగడ్‌లోని ఓ హోటల్లో అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. మృతికి గల కారణాలు ఏంటనేది తెలియరాలేదు. చంఢీగడ్‌లోని నయాగావ్‌కు చెందిన చరణ్ దీప్ అనే 42 ఏళ్ల వ్యక్తి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్‌లో భారత్ వచ్చాడు. తన స్వస్థలానికి వెళ్లాడు. కానీ ఇంట్లో సరిగా ఉండకుండా ఎక్కువగా బయట ఉంటున్నాడని తెలిసింది. సెప్టెంబర్ 19 నుంచి చంఢీగడ్‌లోని హోటల్ ఆరెంజ్‌లో బస చేస్తున్నాడు. అయితే బుధవారం మధ్యాహ్నం అవుతున్నా హోటల్ రూం నుంచి బయటకు రాకపోవడం, ఎలాంటి స్పందనా లేకపోవడంతో అనుమానించిన సిబ్బంది రూంను తనిఖీ చేశారు. లోపలికి వెళ్లి చూడగా చరణ్ విగతజీవుడై కిందపడివున్నాడు. షాక్‌కు గురైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు. చరణ్ వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నాడని తెలిసిందని, అతడు బస చేసిన హోటల్ రూంలో మూడు లిక్కర్ బాటిళ్లను గుర్తించామని పోలీసులు తెలిపారు. సమాచారాన్ని చరణ్ కుటుంబ సభ్యులకు అందించారు. కానీ ఎలాంటి ఫిర్యాదు చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాలేదని పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలను తెలుసుకోనున్నామని, మృతిని భార్య అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉందని పోలీసులు తెలిపారు.