NRI-done-Charitable-activities-in-his-village

10 గంటలు.. 93 వాహనాలు.. 35 టన్నుల చెత్త!

తాగునీటి రిజర్వాయర్‌ను శుభ్రం చేసిన ఎన్నారై 

ఆంధ్రజ్యోతి, 13-02-2018:బర్మేర్‌.. రాజస్థాన్‌లోని ఎడారి నగరం. స్థానికుల తాగునీటి కోసం 50 ఏళ్ల కిందట ‘కరేలి నది’ రిజర్వాయర్‌ను నిర్మించారు. గత కొన్నేళ్లుగా ఈ రిజర్వాయర్‌ను నిర్లక్ష్యం చేశారు. ఇందిరా గాంధీ కాలువ నిర్మాణంతో కరేలి నది ప్రాధాన్యం తగ్గిపోయింది! స్థానికులు క్రమంగా ఈ రిజర్వాయర్‌ను చెత్త డంపింగ్‌ యార్డుగా మార్చేశారు. ఆస్పత్రుల వ్యర్థాలు, ప్లాస్టిక్‌, ఇళ్లలో వ్యర్థాలు, కుళ్లిపోయిన కూరగాయలు.. ఇలా నగరంలోని చెత్తనంతా ఈ రిజర్వాయర్‌లోనే వేసేశారు. ఫలితంగా ఇందులో నీటిని నిల్వ చేసేందుకు అతికొద్ది స్థలం మాత్రమే మిగిలింది. ఈ పరిస్థితిని చూసి ప్రవాస భారతీయుడు నావల్‌ కిషోర్‌ గోడారా చలించిపోయారు. గత ఏడాది డిసెంబరులో జిల్లా కలెక్టర్‌ శివప్రసాద్‌ ఎం.నకాటే, మున్సిపల్‌ కమిషనర్‌ గుంజన్‌ సోని రిజర్వాయర్‌కు పూర్వవైభవం తీసుకొచ్చి, పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసే మార్గాలను అన్వేషిస్తుండగా.. గోడారా ముందుకొచ్చారు. కరేలి నదిని తాము శుభ్రం చేస్తామంటూ సోదరుడితో కలిసి రంగంలోకి దిగారు. జనవరి 6న రిజర్వాయర్‌లో చెత్తను తొలగించే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. స్థానిక అధికారులతో కలిసి కేవలం పది గంటల్లోనే 35 టన్నుల చెత్త, పూడికను తొలగించారు. ఇందుకోసం ఏడు హైడ్రాలిక్‌ ఎక్స్‌కావేటర్లు, 70 డంపర్లు, 12 జేసీబీలు, 4 ట్రాక్టర్లు.. మొత్తం 93 వాహనాలు వినియోగించారు. చెత్తతో పాటు రిజర్వాయర్‌లోని పూడికను  తొలగించారు. కట్టపై మొక్కలను నాటారు. ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని ప్రధాని మోదీకి అంకితమిస్తున్నట్లు గోడారా తెలిపారు.