northkorea-warned-america-

ఇక ఉత్తర కొరియా వంతు.. అమెరికాకి కౌంటర్ షాక్!

వాషింగ్టన్: ఉత్తర కొరియాతో చారిత్రక శాంతి ఒప్పందం కోసం జరగాల్సిన చర్చలను అర్థాంతరంగా వాయిదా వేసిన అమెరికాకి ఊహించని షాక్ తగిలింది. న్యూయార్క్ వేదికగా ఇరు దేశాల మధ్య గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) జరగాల్సిన ఉన్నత స్థాయి చర్చలను ఉత్తర కొరియా రద్దు చేసుకుంది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో... ఉత్తరకొరియా అధినేత సన్నిహితుడు యాంగ్ చోల్‌తో సమావేశమయ్యే కొద్ది సేపటి ముందే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

అణునిరాయుధీకరణ దిశగా తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ.. శాంతి ఒప్పందంపై అమెరికా తాత్సారం చేస్తోందంటూ ఉత్తర కొరియా ఇప్పటికే గుర్రుగా ఉంది. అమెరికా సంపూర్ణంగా ఆంక్షలు ఎత్తివేయని పక్షంలో మళ్లీ అణ్వాయుధాల తయారీ కొనసాగించి తీరతామని కూడా ఇటీవల కుండబద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఉన్నపళంగా శాంతి చర్చలను వాయిదా వేయడంపై ఉత్తర కొరియా మరింత రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు అణు నిరాయుధీకరణ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలంటూ అమెరికా డిమాండ్ చేసే అవకాశాలున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఉత్తరకొరియా కినుక వహించడానికి ఇదే కారణంగా చెబుతున్నారు. అయితే ఈ ప్రచారాన్ని అమెరికా విదేశాంగ శాఖ తిప్పికొట్టింది. త్వరలోనే మళ్లీ చర్చలు ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.