northkorea-media-said-this-

'కఠిన నిర్ణయం తీసుకునేందుకు వెనుకాడబోము'

వాషింగ్టన్: అమెరికా, దక్షిణకొరియాలు కలిసి నిర్వహిస్తోన్న వైమానిక విన్యాసాలు ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నాయని ఉత్తరకొరియా అధికార మీడియా మండిపడింది. తాము ప్రయోగించిన ఇంటర్ కాంటినేంటల్ బాలిస్టిక్ మిస్సైల్ అమెరికా వెన్నులో వణుకు పుట్టించిందని అందుకే తమను భయపెట్టేందుకు మిత్ర దేశంతో కలిసి వైమానిక విన్యాసాలు నిర్వహిస్తోందని విమర్శించింది. అయితే ఆ విన్యాసాలు ఉత్తరకొరియాను ఎప్పటికీ భయపెట్టలేవంటోంది. నిజానికి ఉత్తరకొరియా తలుచుకుంటే ఇప్పుడే యుద్ధం మొదలుపెట్టగలదని ప్రకటించింది. అయితే అది తమ అభిమతం కాదని తెలిపింది.

శాంతినే తాము ఎప్పుడూ కోరుకుంటున్నామని ప్రకటించింది. అనవసరంగా ఉద్రిక్తతలు రెచ్చగొడితే కఠిన నిర్ణయం తీసుకునేందుకు వెనుకాడబోమని ఘాటుగా వ్యాఖ్యానించింది. మంగళవారం అమెరికా బి1బి యుద్ధ విమానాలు వైమానిక విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఇప్పటికే 230 యుద్ధ విమానాలు ఆ విన్యాసాల్లో పాల్గొంటున్నాయని తెలిసిందే. అయితే బి1బి యుద్ధ విమానాల ప్రవేశంతో ఉత్తరకొరియాకు భయం పట్టుకుందని అమెరికా మీడియా వ్యాఖ్యానించింది. ఉత్తరకొరియా మీడియా చేసిన వ్యాఖ్యలను ఖండించింది.