:: Welcome to NRI - Article ::

ఉత్తరకొరియా, దక్షిణకొరియా సరిహద్దులో ఊహించని ఘటన

ప్యాంగ్‌యాంగ్/సియోల్: ఉత్తరకొరియా, దక్షిణకొరియా సరిహద్దులో సోమవారం ఆసక్తికరమైన ఓ పరిణామం జరిగింది. ఉత్తరకొరియా మిలిటరీకి చెందిన ఓ సైనికుడు సరిహద్దు దాటాడు. తన సైన్యం కన్నుకప్పి ఇరుదేశాల మధ్య సరిహద్దును దాటి దక్షిణకొరియాలోకి ప్రవేశించాడు. ఆలస్యంగా గమనించిన ఉత్తరకొరియా సైనికులు అతడిపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో దాదాపు 6 బుల్లెట్లు ఫిరాయింపు చేసిన సైనికుడి శరీరంలోకి చొచ్చుకుపోయాయి. ప్రాణాలతో బయటపడ్డ అతడిని దక్షిణకొరియా సైనికులు గుర్తించారు. హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. మోకాళ్లు, భూజాలపై తీవ్రమైన గాయాలయ్యాయని, ప్రాణానికి ప్రమాదం లేదని దక్షిణకొరియా రక్షణశాఖా తెలిపింది. ఉత్తరకొరియా సైన్యానికి ఎందుకు ఫిరాయింపుదారుడిగా మారాడనే కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.

 
ఇదిలావుండగా ఈ దశాబ్ధంలో ఎప్పుడూలేని విధంగా కొరియన్ ద్వీపకల్ప ప్రాంతంలో అమెరికా నావీ దళాలు మోహరించాయి. భారీ సైనిక సన్నాహకాలను నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితులతో అమెరికా, ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్తకర పరిస్థితులలో ఏమాత్రం తగ్గుదల లేదు. ఇరుదేశాధినేతలు హెచ్చరికలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.