North-korea-and-america-statements-on-Trump-kim-meeting

ఒప్పందం చరిత్రాత్మకం

ప్రచ్ఛన్న యుద్ధానికి తెర: దక్షిణ కొరియా

ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాం: భారత్‌
 
సియోల్‌, జూన్‌ 12: అమెరికా, ఉత్తర కొరియా అధ్యక్షులు ట్రంప్‌, కిమ్‌ జాంగ్‌ ఉన్‌ల మధ్య చర్చల పట్ల దక్షిణ కొరియా హర్షం వ్యక్తం చేసింది. ఇది ఓ చరిత్రాత్మక ఘట్టమని, దీనిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ అన్నారు. సింగపూర్‌ ఒప్పందంతో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరపడుతుందని అభిప్రాయపడ్డారు. కాగా ట్రంప్‌, కిమ్‌ మధ్య చర్చలు సానుకూల పరిణామమని, దీనిని స్వాగతిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ట్రంప్‌, కిమ్‌ల మధ్య జరిగినవి కీలకం, తప్పనిసరైన చర్చలని యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) పేర్కొంది.
 
ఇవి ఉత్తర కొరియా అణ్వస్త్ర రహితంగా మారనుందన్న అంశానికి సంకేతాలని ఈయూ ప్రధాన దౌత్యాధికారి ఫెడెరికా మొఘెరిని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఈ చర్చలు సానుకూల పరిణామమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ అన్నారు. ట్రంప్‌తో కిమ్‌ చర్చలు ఫలప్రదమైన నేపథ్యంలో ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు ఎత్తివేయాలని చైనా కోరింది. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఒప్పందానికి సింగపూర్‌ వేదికగా నిలవడం గొప్ప గౌరవమని ఆ దేశ ప్రధాని లీ సైన్‌ లూంగ్‌ అన్నారు. కాగా రెండు దేశాల మధ్య ఒప్పందం ఉత్తర కొరియాలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధంలో మైలురాయి అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అన్నారు.
 
జపాన్‌, దక్షిణ కొరియా బెంబేలు
సైనిక విన్యాసాలు ఆపేస్తామంటూ ట్రంప్‌ చేసిన ప్రకటన జపాన్‌, దక్షిణకొరియాల్లో వణుకు పుట్టిస్తోంది. పెంటగాన్‌ను సైతం ఇది నిర్ఘాంతపర్చింది. కిమ్‌ సాగిస్తున్న అణ్వస్త్ర కార్యక్రమం వల్ల తొలి దెబ్బ తగిలేదీ, తీవ్రమైన నష్టం జరిగేదీ ఈ రెండు దేశాలకే! ముఖ్యంగా జపాన్‌కు చెందిన వందలాది యుద్ధ ఖైదీలు, సామాన్యులు కొరియా జైళ్లలో మగ్గుతున్నారు. వారందరి విడుదలకు ఈ భేటీ మార్గం సుగమమైనా.. ఉత్తర కొరియా నుంచి తమకు ఇంకా ముప్పు పొంచే ఉందని జపాన్‌ భయపడుతోంది.