no-society-welfare-only-selfishness-

'దీక్షితులుకు స్వార్థం తప్ప సమాజహితం పట్టదా'?

ఆలయాలలో అర్చకత్వ బాధ్యతల్లో ఉన్న వారికి 65 ఏళ్లకు పదవీవిరమణ వర్తంపజేయాలన్న ప్రభుత్వ నిబంధనను అమలు చేసినందుకు కొందరు  మాత్రం ఎందుకు యాగీ చేస్తున్నారో, స్వార్థపూరితమైన ఆలోచనలతో బ్రాహ్మణ సమాజానికి చేటు జరిగేలాగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని అమెరికాలోని ఏపి ఎన్ఆర్‌టీ చీఫ్ కోఆర్డినేటర్ బుచ్చి రామప్రసాద్ ఆరోపించారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉంటూ అనేక వివాదాలకు కారణమైన రమణ దీక్షితులు వ్యవహార సరళి యావత్ బ్రాహ్మణ సమాజానికే తలవంపులు తెచ్చేలా ఉన్నదని, యావత్తు బ్రాహ్మణ జాతి ఆయన వైఖరిని ఈసడించుకుంటోందని బుచ్చి రామప్రసాద్ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి సేవను స్వార్థంతో నింపేసిన దీక్షితులుకు మద్దతుగా ఐవైఆర్ కృష్ణారావుకూడా గళం విప్పడం, న్యాయపరంగా ముందుకెళ్తామంటూ.. పసలేని బెదిరింపులకు దిగడం అసహ్యంగా ఉన్నదని బుచ్చి రాంప్రసాద్ ఆరోపించారు.


రమణ దీక్షితులు ఎంతటి అహంకారంతో ఉంటారో, ఎంత స్వార్థ చింతనతో వ్యవహరిస్తారో దశాబ్దాలుగా అందరికీ తెలిసిన సంగతే అని ఆయన అన్నారు. గతంలో మాడంబాకం వారు ప్రధాన అర్చకులుగా ఉన్న సమయంలోనే తనకున్న రాజకీయ ప్రాపకంతో వయస్సులోనూ తనకంటె ఎంతో పెద్ద అయిన మాడంబాకం వారిని లెక్క చేయకుండా... వారిని పక్కన పెడుతూ రమణ దీక్షితులు తిరుమల ఆలయ విధుల్లో చెలరేగేవారని ఆరోపించారు. అలాంటిది ఇప్పుడు తనకు 69 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కూడా, తాను తప్ప మరొకరు స్వామి సేవాభాగ్యాన్ని పొందకూడదు అనే స్వార్థచింతనతో వివాదాన్ని రేకెత్తించడం సరి కాదని బుచ్చి రామప్రసాద్ పేర్కొన్నారు. వయస్సు పై బడుతున్నప్పుడు, కొత్త వారికి అవకాశం ఇస్తూ ఆయనే ముందుగా తప్పుకుని ఉంటే చాలా గౌరవంగా ఉండేదని కూడా చెప్పారు.
 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవారి పట్ల ఎంతో భక్తి ప్రపత్తులతో ఉంటారు. తాను సీఎంగా అయిన్నప్పటికీ.. ప్రోటోకాల్ అమలులో ఉన్నప్పటికీ.. ఎప్పుడు తిరుమల వచ్చినా సామాన్య భక్తుడిలాగా దైవదర్శనం చేసుకోవడం ఆయనకు అలవాటు. ఆచారాల విషయంలోనూ ఆయన ఎంతో నిష్టగా ఉంటారు. అలాంటి చంద్రబాబునాయుడు పాలనలో ఎలాంటి ఆగమవిరుద్ధమైన స్వామి పట్ల అనుచితమైన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉండదన్నారు.. దీక్షితులు, ఐవైఆర్ కృష్ణారావు లాంటి వాళ్లు పనిగట్టుకుని విమర్శలు చేసే తీరు మంచిది కాదని బుచ్చి రాంప్రసాద్. మండిపడ్డారు.
 
తిరుమల శ్రీవారి ఆలయ భాగ్యం దక్కినందుకు మిరాశీ రూపంలోనూ, అది అంతరించిన తర్వాత.. అర్చకత్వ హోదాను అడ్డు పెట్టుకుని.. సంపన్నులకు వ్యక్తిగతపూజలు చేయించే రూపంలోనూ కోట్లకు కోట్లు దండుకుంటూ మాఫియాలాగా మారిన రమణ దీక్షితులు తన దందాలకు ప్రభుత్వం చెక్ పెట్టడాన్ని సహించలేకపోతున్నారని బుచ్చి రాంప్రసాద్ చెప్పారు. కేంద్రంలోని ప్రముఖుల్ని కలిసి.. వారి ద్వారా కుట్ర రాజకీయాలు చేసే వైఖరిని రమణ దీక్షితులు, ఐవైఆర్ కృష్ణారావులాంటి వాళ్లు  మానుకోవాలని, బ్రాహ్మణ వివేకానికి, వివేచనకు తలవంపులు తెచ్చేలా ప్రవర్తించకూడదని ఆయన హితవు చెప్పారు.