Nizamabad-Youth-commit-suicide-in-Gulf

గల్ఫ్‌లో నిజామాబాద్ యువకుడు ఆత్మహత్య

 

నిజామాబాద్: బతుకుదెరువు నిమిత్తం అప్పుచేసి గల్ఫ్‌ దేశం వెళ్లి.. అక్కడ జీతం తక్కువగా వస్తుండడంతో చేసిన అప్పు తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురైన ఓ గిరిజన యువకుడు గురువారం ఉదయం బెహరాన్‌లో ఆయన నివాసం ఉండే గదిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం కొత్త కోరుట్ల తండాకు చెందిన బాదవత్‌ గణేష్‌ (28) ఇరవై రోజుల క్రితం అప్పు చేసి బతుకుదెరువు నిమిత్తం బెహరాన్‌ వెళ్లాడు.
 
అక్కడ చేస్తున్న పనికి జీతం తక్కువగా వస్తుండడంతో స్వగ్రామంలో చేసిన అప్పు తీర్చలేననే ఆవేదనతో, స్వగ్రామానికి రాలేక గల్ఫ్‌ దేశంలోనే ఆత్మహత్యకు ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న గణేష్‌ భార్య, కూతురు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బెహరాన్‌లో చనిపోయిన గణేష్‌ మృతదేహాన్ని కొత్త కోరుట్ల తండాకు తీసుకొచ్చే విధంగా నిజామాబాద్‌ ఎంపీ కవిత, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ చొరవ చూపాలని గల్ఫ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధి పాట్కూరి బసంత్‌రెడ్డి, మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. గణేష్‌ భార్య ప్రస్తుతం నిండు గర్భిణి అని తండావాసులు పేర్కొన్నారు.