:: Welcome to NRI - Article ::

వలసలపై న్యూజీలాండ్ సలసల!

అమెరికా బాటలో న్యూజిలాండ్‌
ఈ దేశంలోనూ వలసలపై ఆంక్షలు
కనీస వేతనాల పరిమితి పెంపు

మెల్బోర్న్‌/వెల్లింగ్టన్‌, ఏప్రిల్‌ 20: భారతీయులు విదేశీ ఉద్యోగాల ఆశలను వదులు కోవాల్సిందేనా..! అంటే అవుననే అంటున్నాయి తాజా పరిస్థితులు. అమెరికా, ఆస్ర్టేలియా, బ్రిటన్‌కి తోడు ఇప్పుడు న్యూజిలాండ్‌ కూడా వలసలపై ఆంక్షలను కఠినతరం చేస్తోంది. తమ దేశంలో వలసలు పెరిగిపోయాయని.. వాటిని నియంత్రించాలంటే నిబంధలను మార్చాల్సిందేనని ఇక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇలా చేయడం వల్ల తమ దేశానికి మెరుగైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు లభించడంతో పాటు.. వలసలూ అదుపులోకి వస్తాయని భావిస్తోంది. వలస ఉద్యోగులకు కనీస వేతన పరిమితిని భారీగా పెంచింది. అయితే ఆ పరిమితి ఎంతో స్పష్టం చేయలేదు. 
 
న్యూజిలాండ్‌ ఇమ్మిగ్రేషన్‌ మంత్రి మైఖేల్‌ వుడ్‌హౌస్‌ మాట్లాడుతూ.. దేశంలోకి వలస వచ్చినవారి జనాభా అత్యధిక స్థాయికి చేరిందని.. వలసలను నియంత్రించడానికి కొన్ని ఆంక్షలను విధిస్తున్నామని తెలిపారు. విదేశీ ఉద్యోగులపై ఆధారపడే న్యూజిలాండ్‌ కంపెనీలకు ఇకపై కష్టకాలమేననని హెచ్చరించారు. ఉద్యోగ అవకాశాల్లో స్వదేశీయులకే తొలి ప్రాధాన్యం ఉంటుందని.. కివీస్‌ ఫస్ట్‌ నినాదానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. వాస్తవానికి న్యూజిలాండ్‌కి త్వరలో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ వలసలు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఫిబ్రవరి ఆఖరుకు న్యూజిలాండ్‌లో వలసవాదుల సంఖ్య 71300కి చేరింది. ఇది ఆ దేశ జనాభా48 లక్షల్లో 1.5 శాతం. న్యూజిలాండ్‌కి వలస వచ్చే ఉద్యోగుల్లో చైనా, భారత్, బ్రిటన్‌ వారు ఎక్కువ.
 
న్యూజిలాండ్‌లో.. 
ఆదాయ పరిమితులను పెం చారు. కానీ ఎంతో చెప్పలేదు.
స్కిల్డ్‌ ఇమ్మిగ్రెంట్‌గా అర్హత సాధించాలంటే మధ్యస్థాయి జీతం లభించే ఉద్యోగం పొందాలి.
హైలీ స్కిల్డ్‌ అర్హత సాధించాలంటే.. మధ్యస్థాయి ఆదాయం కన్నా మరో 150 శాతం అధిక వేతనం ఇచ్చే ఉద్యోగం సాధించాలి.
తక్కువ నైపుణ్యమున్న వారికి మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది.
Loading...