న్యూయార్క్: ‘నాకు చంపాలని ఉంది. ప్రజల తలలు నరికి, తుపాకీతో కాల్చి వీడియోలు తీయాలని ఉంది’ ఇవీ న్యూయార్క్‌కు చెందిన జీసస్ విల్ఫ్రెడో ఎన్కార్నేషన్ అనే వ్యక్తి మాటలు. ఇవి చెప్పిందెవరికో తెలుసా? ఓ ఎఫ్‌బీఐ ఏజెంట్‌కి. అతని ద్వారా పాకిస్తాన్‌కు చెందిన టెర్రరిస్టు సంస్థ లష్కరే తాయిబాలో చేరడం జీసస్ ఆశయం. దానికోసం చాలా ఏళ్లుగా ప్రయత్నించి, చివరకు అమెరికా నుంచి యూరప్ బయలుదేరాడు. యూరాప్లో కొంతమంది పాక్ టెర్రరిస్టులను కలిసి, వారితోపాటు పాకిస్తాన్ వెళ్లిపోవాలని అతని పథకం. పాక్ చేరుకున్నాక అక్కడ రకరకాల ట్రైనింగ్‌లు తీసుకుని, కావాలంటే న్యూయార్క్‌పై ఉగ్రదాడి చేస్తానని అతను కొందరు టెర్రరిస్టులతో చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు న్యూయార్క్ దాటకముందే జీసస్‌ను అరెస్టు చేశారు. అతనిపై ఉగ్రదాడులకు సాయం చేయడానికి ప్రయత్నించినందుకు, ఉగ్రవాద సంస్థలో చేరడానికి చూసినందుకు కేసులు పెట్టారు. నేరం రుజువైతే అతనికి నలభై ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది.