New-Changes-in-Passport

ఇకపై 2 రంగుల పాస్‌పోర్టులు!

 

చివరి పేజీ ఖాళీగా ఉంచుతారు
తండ్రి పేరు, చిరునామా ఉండవు
త్రిసభ్య కమిటీ నివేదికకు కేంద్రం ఓకే
గడువు ముగిసే వరకు ప్రస్తుత పాస్‌పోర్టులు చెల్లుతాయి

న్యూఢిల్లీ, జనవరి 13: ఇండియన్‌ పాస్‌పోర్టులు ఇకపై రెండు రంగుల్లో ఉండనున్నాయి. అదే సమయంలో పాస్‌పోర్టులోని చివరిపేజీని ఖాళీగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. విదేశీ వ్యవహారాలు, మహిళ, శిశు సంక్షేమశాఖ అధికారులతో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ అందజేసిన నివేదికతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పాస్‌పోర్టులోని చివరి పేజీలో తండ్రి లేదా సంరక్షకుడి పేరు, తల్లి, భార్య పేర్లు, చిరునామా, పాస్‌పోర్టు కలిగిన వ్యక్తికి ఎమిగ్రేషన్‌ చెక్‌ అవసరమా.. కాదా అన్న వివరాలు ఉంటున్నాయి. ఇకపై చివరి పేజీని ఖాళీగా ఉంచడంతో..ఈ వివరాలన్నీ పాస్‌పోర్టులో ఉండవు.
 
దీంతో అడ్రస్‌ ప్రూఫ్‌ కోసం పాస్‌పోర్టును వినియోగించుకునే అవకాశం ఉండదు. అలాగే ఎమిగ్రేషన్‌ చెక్‌ అవసరమా.. కాదా.. అని నిర్ధారించేందుకు పాస్‌పోర్టును రెండు రంగుల్లో తీసుకురానున్నారు. ఎమిగ్రేషన్‌ చెక్‌ అవసరమైన వారికి కాషాయ రంగులో ఉండే పాస్‌పోర్టును, ఇమ్మిగ్రేషన్‌ చెక్‌ అవసరం లేని వారికి ప్రస్తుతం జారీ చేస్తున్న నీలం రంగులోనే ఉంటాయి. దీని ప్రకారం భర్త నుంచి విడిపోయి ఒంటరిగా జీవనం సాగిస్తున్న తల్లుల వద్ద పెరిగిన పిల్లల పాస్‌పోర్టులోను, దత్తత పిల్లల పాస్‌పోర్టులోను ఇకపై తండ్రి పేరు ఉండదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పాస్‌పోర్టులు వాటి గడువు ముగిసే వరకు చెల్లుబాటులో ఉంటాయని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది.