New-Bill-introduced-in-Rajya-Sabha-for-NRIs

ఎన్నారైల కోసం భారత్ కొత్త చట్టం.. పాటించకపోతే పాస్‌పోర్ట్ రద్దు

న్యూఢిల్లీ: విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తినే అల్లుడిగా చేసుకుందామని ప్రతి ఆడపిల్ల తండ్రి కలలు కంటాడు. ప్రస్తుతం సమాజంలో నడుస్తున్న ట్రెండ్ కూడా ఇదే. ఇదే సమయంలో భారత్ నుంచి విదేశాలకు వెళ్తున్న చాలా మంది ఆడపిల్లలకు అక్కడ భద్రత లేకుండా పోతోంది. పెళ్లి తరువాత తమ అల్లుడు మంచి వాడు కాదని తెలిసినా..కూతుర్ని చిత్రహింసలు పెడుతున్నా తల్లిదండ్రులు, ఇక్కడి అధికారులు ఏం చేయలేని పరిస్థితి. దీన్నే అవకాశంగా తీసుకుని అనేక మంది ఎన్నారైలు ఎన్నో అక్రమాలకు కూడా పాల్పడుతున్నారు. అయితే ఇకపై ఇలాంటి ఆటలు సాగనివ్వమంటూ కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును రూపొందించి రాజ్యసభలో ప్రవేశపెట్టింది. భారతదేశంలో పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క ఎన్నారై.. పెళ్లైన ముప్పై రోజుల్లోగా వివాహం జరిగినట్టు రిజిస్టర్ చేసుకోవాలని..లేదంటే వారి పాస్‌పోర్టును అధికారులు బంధీ చేసుకుంటారంటూ ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ ఆఫ్ నాన్-రెసిడెంట్ ఇండియన్ బిల్, 2019’ను రూపొందించారు. వివాహం జరిగినట్టుగా రిజిస్టర్ చేసుకోని ఎన్నారైలను నేరస్థులుగా ప్రకటించి వారి ఆస్తులను కోర్టు జప్తు చేసేలా ఈ బిల్లును తయారుచేశారు. అయితే బడ్జెట్ సమావేశాలు బుధవారంతో ముగియడం, లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఈ బిల్లు చట్టంగా మారటానికి సమయం పట్టవచ్చు.