Monthly-Literature-Summit-by-TANTEX

టెక్సాస్‌లో 129వ టాంటెక్స్ సాహిత్య వేదిక సదస్సు

టెక్సాస్: ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల కోసం ఖండాంతరాలు దాటినా.. తెలుగు వారు తమ సంస్కృతి, సంప్రదాయాలను ఏమాత్రం మర్చిపోవడం లేదు. తెలుగు భాషకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. టెక్సాస్‌లోని తెలుగు ప్రవాసులు ప్రతినెలా తెలుగు భాషను.. తమ భావితరాలకు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ‘నెలనెలా తెలుగు వెన్నెల’ పేరిట ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య సదస్సు ఏప్రిల్ 15న ఆదివారం జరిగింది. సాహిత్య వేదిక సమన్వయ కర్త శ్రీ వీర్నపు చినసత్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వందలాది మంది సాహిత్య ప్రియులు, తెలుగు ప్రవాసులు హాజరయ్యారు. విదేశీ గడ్డపై నిరాటంకంగా 129 నెలలుగా ఈ కార్యక్రమాన్ని ఉత్తమ సాహితీ వేత్తల నడుమ నిర్వహించడం ఈ సంస్థ విశేషం.

స్వాతిమూర్తి శిష్య బృందం ప్రధాన గీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమయింది. తెలుగు సామెతల మీద ఊరిమిండి నరసింహారెడ్డి ఆసక్తి కరమైన అంశాలను పంచుకున్నారు. ప్రతి నెలలాగానే ఈ సారి కూడా స్వర్ణ అట్లూరి ‘తెలుగు క్విజ్’ను చక్కగా నిర్వహించారు. చిన్నారులు సాహితి, సింధూర వేముల అన్నమయ్య కిర్తనలతో అందరినీ అబ్బుర పరిచారు. శ్రీనాధ్ జంధ్యాల.. సభకు ‘అంత్ర్వేది’ పుస్తక పరిచయం చేశారు. ఆముక్తమాల్యద, శ్రీ భాగవతం నుంచి కొన్ని పద్యాలను ఎంచుకుని, సాహిత్య మెళుకువలను పుదూర్ జగదీశ్వరన్ తెలియజేశారు. ప్రముఖంగా శ్రీ కృష్ణ దేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ‘శ్రీ కమనీయ హారమణి ..’ అనే మొట్టమొదటి పద్యంలో ఉన్న కవిత్వాన్ని సోదాహరణలతో వివరించి ప్రసంశలు అందుకున్నారు.
 
ఆ తర్వాత యూఎస్‌ఏ ఓపెన్ ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించిన తెలుగు తేజం రవితేజను సాహితీ మండలి సభ్యులు బసాబత్తిన శ్రీనివాసులు సభకు పరిచయం చేశారు. ఆత్మరక్షణార్థం వీలైనంతవరకు ప్రతి ఒక్కరూ కరాటే, తైక్వండో లాంటి విద్యలు అభ్యసించాలని వివేక్ తేజ అన్నారు. తనను సంప్రదిస్తే సహాయపడడానికి సిద్ధంగా ఉన్నానని 2020 టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించడమే తన లక్ష్యమని హర్షధ్వానాల మద్య ప్రకటించారు.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ హాజరయ్యారు. జలసూత్రం చంద్రశేఖర్ ఆయనను సభకు పరిచయం చేస్తూ.. ఆయన ఇక్కడకు రావడం తనకు మర్చిపోలేని అనుభూతి అని వ్యాఖ్యానించారు. ప్రఖ్యాత కవి జంధ్యాల పాపయ్య శాస్త్రికి ఆయన స్వయానా కుమారుడని తెలిపారు. తండ్రి అడుగుజాడల్లో నడిచిన ఆయన రచించిన ‘చంద్రోదయం’ అనే కవితకు ఏపీ ప్రభుత్వం బంగారు పతకం ఇచ్చి సత్కరించిందని వివరించారు. ‘శ్రీనాథుని సమాజ దర్శనం’ అనే అంశం మీద జంధ్యాల జయకృష్ణ బాపూజీ అమితాసక్తి గొలిపే ప్రసంగం చేశారు. 
 
శ్రీనాథుడు 15వ శతాబ్దానికి చెందినవారని,  కొండవీడు రాజ్యానికి రాజుగా ఉన్న పెదకోమటి వేమారెడ్డి కొలువులో విద్యాధికారిగా ఉండేవారని వివరించారు. సంస్కృత, తెలుగు భాషలతో పాటు, కన్నడ, తమిళ్ ఇంకా ఎన్నో భాషల్లో శ్రీనాథుడు ప్రావీణ్యుడని తెలిపారు. 12 ఏళ్ల వయసులోనే  మరుత్త రాజ చరిత్రను, తదుపరి శృంగార నైషధం వంటి 17 కావ్యాలు రాసినా ప్రస్తుతం 7 మాత్రమే లభ్యమవుతున్నాయన్నారు. ఆనాటి కవులలో ఎక్కువగా దేశాటనం చేసిన కవి శ్రీనాధుడేనని, భాగవతాన్ని రాసిన పోతన సమకాలికుడు ఆయనని తెలియజేసారు. ఆయనకు కవిసార్వభౌమ అనే బిరుదు ఎలా వచ్చిందో ఆసక్తికరమైన కథగా వర్ణించారు. 
 
‘‘హంపీ విజయనగరం రాజైన అచ్యుత రాయల కొలువులో గౌడ డింఢిమ భట్టు అనే గొప్ప కవి ఉండేవారు. శ్రీనాథుడు రాజాజ్ఞపై కొండవీడు నుండి విజయనగరం ప్రయాణం చేసి గౌడ డింఢిమ భట్టును తన వాద పటిమతో ఓడించి కవిసార్వభౌమ బిరుదాంకితుడు అయ్యారు..’ అని జయకృష్ణ వివరించారు. ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో శ్రీనాథుడుని స్మరించుకొనేలా చేసి, అందరి అభినందనలు అందుకున్నారు.  శ్రీనాథుని జీవితాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణన చేయడమే కాకుండా, తన చక్కని గాత్రంతో ఆ మహాకవి రాసిన చాటు పద్యాలను పాడి వినిపించారు. 
 
జంధ్యాల జయకృష్ణ బాపూజీని, వివేక్ తేజను టాంటెక్స్ సాహితీ కమిటీ సభ్యులు,  టాంటెక్స్ అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం, ఉపాధ్యక్షుడు చినసత్యం వీర్నపు, సుధ కలవగుంట, స్వర్ణ అట్లూరి, పాలకమండలి సభ్యులు సంయుక్తంగా శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) కార్యవర్గ, పాలకమండలి బృందం, ఉపాధ్యక్షుడు క్రిష్ణారెడ్డి కోడూరు, జొన్నలగడ్డ సుబ్రమణ్యం, ఊరిమిండి నరసింహారెడ్డి, కాకర్ల విజయ్, తోటకూర ప్రసాద్, సతీష్ బండారు, తదితరులు పాల్గొన్నారు. తనను ఎంతగానో ఆదరించి, చక్కటి ఆతిథ్యం అందించిన టాంటెక్స్ కార్యవర్గానికి జంధ్యాల జయకృష్ణ బాపూజీ కృతజ్ఞతలు తెలియజేశారు. సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు సమన్వయకర్త వీర్నపు చినసత్యం 
కృతజ్ఞతలు తెలిపారు.