Mom-throws-son-from-second-floor

రెండో అంతస్తు నుంచి బిడ్డను విసిరేసిన తల్లి..!

అజ్మన్: అమ్మ.. ప్రపంచంలో అన్నింటి కన్నా తన బిడ్డ చిరునవ్వే ముఖ్యమనుకునే ఓ అమాయకురాలు. పిల్లవాడు ఏడిస్తే బిడ్డ కన్నా ఎక్కువగా తల్లడిల్లిపోయే సున్నిత మనస్కురాలు. అటువంటి తల్లి తన బిడ్డను రెండో అంతస్తు నుంచి రోడ్డుపై విసిరేసింది! ఈ ఘటన యూఏఈలోని అజ్మన్ పట్టణంలో సోమవారం జరిగింది. ఆ తల్లి నిజంగా అంత కర్కోటకురాలా? బిడ్డను వదిలించుకోవడానికే అలా రోడ్డుపైకి విసిరేసిందా? తెలుసుకోవాలంటే అసలేం జరిగిందో తెలుసుకోవాలి. ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్నాడు. ఇంతలో పక్కనే ఉన్న భవనంలోంచి అరుపులు వినిపించాయి. తలెత్తి చూస్తే.. ఆ భవనంలో నుంచి నల్లటి పొగలు వస్తున్నాయి. ఇల్లు తగలబడుతోందని అతనికి అర్థమయ్యే సరికి.. ఆ భవనం రెండో అంతస్తు కిటికీ వద్దకు ఓ మహిళ వచ్చింది. ఏం చేయబోతోందా? అని చూస్తుండగానే.. ఏదో అంటూ ఓ పసిపాపను కిటికీ గుండా బయటకు విసిరేసింది. పరిస్థితి అర్థం చేసుకున్న  ఆ వ్యక్తి వెంటనే ముందుకురికి ఆ బిడ్డను పట్టుకున్నాడు. పసివాడికి ఎటువంటి గాయాలూ కాకుండా కాపాడాడు. ఇంతలో ఆమె కూడా కిటికీలోంచి దూకేసింది. అలాగే మొదటి అంతస్తు నుంచి కూడా ఓ వ్యక్తి రోడ్డుపై పడ్డాడు. పసివాడికి ఎటువంటి గాయాలూ కానప్పటికీ, ఆ తల్లి తీవ్రంగా గాయపడింది. అలాగే మొదటి అంతస్తు నుంచి దూకిన వ్యక్తి కూడా గాయపడ్డాడు. ఈ ఘటన అజ్మన్ పట్టణంలోని అల్ నౌమియా2 ప్రాంతంలో జరిగింది. కాసేపటికి అక్కడికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. మంటలను ఆర్పి, ఆ భవనంలో చిక్కుకుపోయిన మరో ఆరుగురిని కాపాడారు. వారిని, వారితో పాటు బయటకుదూకి గాయాలపాలైన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఆ భవనంలోని కారిడార్‌లో ఫ్రిజ్, వాషింగ్ మెషీన్‌ ఉన్నాయని, వాటి వద్ద ఆరంభమైన మంటలు క్రమంగా ఆ భవనాన్ని చుట్టుముట్టాయని అధికారులు తెలిపారు. మరింత సమాచారం కోసం ఫోరెన్సిక్ నిపుణులు వెదుకుతున్నారని చెప్పారు. అత్యవసర సమయంలో ఉపయోగించే ఎమర్జెన్సీ మార్గాల వద్ద ఎటువంటి వస్తువులు అడ్డు పెట్టవద్దని ఇతర భవనాల యజమానులను హెచ్చరించారు.