mobile-calls-in-plane-from-january

జనవరి నుంచి విమానాల్లో మొబైల్‌ కాల్స్‌!

న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులు గగనతలం నుంచే తమ సన్నిహితులతో మొబైల్‌ కాల్స్‌ చేసుకునేందుకు, ఇంటర్నెట్‌ వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతించనుంది. న్యాయశాఖ ఇందుకు సంబంధించిన నిబంధనలు ప్రకటించగానే జనవరి నెల ప్రారంభంలో ఈ మేరకు అనుమతులు ఇచ్చే ఆస్కారం ఉన్నదని టెలికాం శాఖ మంత్రి మనోజ్‌సిన్హా తెలిపారు. న్యాయశాఖ నుంచి అనుమతులు వచ్చినట్టయితే వారం, పది రోజుల వ్యవధిలోనే దాన్ని అమలులోకి తెస్తామని ఆయన చెప్పారు. ఇప్పటికే పలు అభివృద్ధి చెందిన దేశాలు విమానాల్లో కనెక్టివిటీ కల్పించగా ఆ తరహాలోనే మన దేశంలో కూడా అనుమతించాలన్న టెలికాం శాఖ ప్రతిపాదనను టెలికాం కమిషన్‌ మే ఒకటో తేదీన సూత్రప్రాయంగా ఆమోదించింది.

ఇలా విమానాల్లో కనెక్టివిటీకి సంబంధించిన నిబంధనలు సముద్ర రవాణాకు కూడా వర్తిస్తాయంటున్నారు. ప్రాదేశిక జలాల పరిధిలో అనుతిస్తారా లేక ప్రత్యేక ఆర్థిక జోన్లలో (ఈఈజడ్‌) అనుమతిస్తారా అన్న విషయం గురించిన ప్రశ్నకు ఆ విషయంలో కూడా అంతర్జాతీయ ఉత్తమ ప్రమాణాలు అనుసరించాలని టెలికాం శాఖ భావిస్తున్నదని ఒక అధికారి చెప్పారు. ప్రాదేశిక జలాల పరిధి 12 నాటికల్‌ కిలోమీటర్లు కాగా ఈఈజడ్‌ల పరిధి 200 నాటికల్‌ మైళ్లుంటుంది. కాగా విమానాల్లో కనెక్టివిటీ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఎయిరిండియా, విస్తారా సహా పలు ప్రధాన విమానయాన సంస్థలు ఆహ్వానించాయి. అయితే విమానాల్లో కనెక్టివిటీ కల్పించే టెలికాం కంపెనీల నుంచి ప్రత్యేక లైసెన్సు ఫీజు వసూలు చేస్తారు.