Minimum-10-indian-workers-dying-everyday-in-gulf-countries

గల్ఫ్ దేశాల్లో నిత్యం పది మంది భారతీయుల మృతి

గల్ఫ్: ఆర్థిక పరిస్థితి బాగోలేకో లేక ఇక్కడ మంచి ఉద్యోగాలు దొరకకపోవడంతో పొట్ట నింపుకోడానికి భారతదేశం నుంచి అనేక మంది గల్ఫ్ దేశాలు వెళ్తున్నారు. అయితే వారిలో చాలా మంది అక్కడ అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. అక్కడి ప్రభుత్వాలు వారితో కష్టతరమైన పనులు చేయించడంతో ఇక్కడి నుంచి వెళ్లిన వారు అక్కడ ప్రాణాలను వదిలేస్తున్నారు. ఒమన్, బహ్రెయిన్, కతర్, సౌదీ దేశాలలోని భారతీయ సంస్థల నుంచి భారతదేశానికి చెందిన కార్మికులు 2012 నుంచి 2018 వరకు ఎంత మంది మరణించారన్న సంఖ్యను కామన్‌వెల్త్ మానవ హక్కుల కార్యక్రమానికి చెందిన వెంకటేశ్ నాయక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి తెలుసుకున్నారు. ఆయన సేకరించిన డేటా ప్రకారం 2012 నుంచి 2018 జూన్ వరకు 24,570 మందికి పైగా ఆయా దేశాల్లోని భారతదేశ కార్మికులు చనిపోయినట్టు తేలింది. యూఏఈ, కువైత్ మాత్రం ఈ లెక్కలను చెప్పడానికి నిరాకరించింది. అన్ని దేశాల నుంచి సమాచారం వస్తే ఈ సంఖ్య మరింత పెరగవచ్చని ఆయన చెప్పారు. ఈ లెక్కల ప్రకారం చూసుకున్నా ప్రతిరోజు గల్ఫ్ దేశాల్లో 10 మందికి పైగా భారతీయులు తమ శ్వాసను వదిలేస్తున్నారన్నారు. 2017 లెక్కల ప్రకారం భారతదేశం నుంచి వెళ్లి గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన వారి సంఖ్య 22 లక్షల 53 వేలు. అంతేకాకుండా భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా చెల్లిస్తున్న సొమ్ములో సగానికి పైగా గల్ఫ్ దేశాల నుంచే వస్తోందని వెంకటేశ్ నాయక్ చెప్పారు. 2012 నుంచి 2017 వరకు భారతదేశానికి 410 బిలియన్ డాలర్ల చెల్లింపులు జరగగా..అందులో 209 బిలియన్ డాలర్లు కేవలం గల్ఫ్ దేశాల నుంచే జరిగిందన్నారు.