man-who-allegdly-started-holy-fire-says-paying-for-1-million-bail-is-easily

‘రూ.6.9 కోట్ల బెయిలా? వెంటనే కట్టేస్తా...’

కాలిఫోర్నియా: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో అంతకంతకూ వ్యాపిస్తున్న కార్చిచ్చును రాజేసి, 21000 మంది స్థానికుల తరలింపునకు కారకుడంటూ ఆరోపణలు ఎదుర్కుంటున్న ఫోరెస్ట్ గొర్డన్ క్లార్క్(51)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి వెళ్లిన సమయంలో నగ్నంగా ఉన్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆరెంజ్ కౌంటీ కోర్టులో ప్రవేశపెట్టారు. 18 వేల ఎకరాల అడవి తగలబడి పోవడానికి కారణమని పేర్కొన్న న్యాయస్థానం కేసు విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది. అయితే బెయిల్ కోసం 1 మిలియన్ డాలర్లు(రూ. 6.9 కోట్లు) సులభంగా చెల్లిస్తానంటూ నిందితుడు క్లార్క్ వ్యాఖ్యానించాడు. ‘‘మిలియన్ డాలర్లు కట్టాలా? ఇది నాకు చాలా సులువు.. వెంటనే కట్టేస్తా’’ అన్నాడు. అరెస్టుకు ముందు ఓ ఇంటర్వ్యూలో క్లార్క్ తనను కొందరు బెదిరించారని.. తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని  పొంతన లేని మాటలు చెప్పాడు. అయితే క్లార్క్ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కొంత కాలం క్రితం మానసిక చికిత్సల ఆసుపత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. అతని మీద ఉన్న ఆరోపణలు నిజమైతే యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. ప్రస్తుతం దక్షిణ కాలిఫోర్నియాలొని కార్చిచ్చు దాదాపు 28 చదరపు మైళ్ల ప్రాంతంలో విస్తరించి ఉంది. 1200 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు పోరాడుతున్నారు.