man-sexually-harasses-paramedic-in-her-Dubai-room

అద్దె వసూలు చేసే సూపర్‌వైజర్‌నని చెప్పి..

దుబాయ్: ఉపాధి కోసం యూఏఈలోని దుబాయ్ నగరానికి వెళ్లిన ఓ యువతిపై ఓ దుండగుడు లైంగిక దాడికి యత్నించాడు. అద్దె వసూలు చేసే సూపర్‌వైజర్‌నని పరిచయం చేసుకున్న 30 ఏళ్ల దుండగుడు యువతి రూంలోకి ప్రవేశించాడు. అతడితోపాటు ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉండడంతో నిజమేమోనని బాధిత యువతి నమ్మింది. కొద్దిసేపటి తర్వాత దుండగుడి పక్కనున్నవారు వెళ్లిపోయారు. మహిళ రూంలోకి మరోసారి ఒంటరిగా ప్రవేశించిన దుండగుడు ‘‘ నువ్వు నాకు నచ్చావు. నిన్ను టచ్ చేయాలని ఉంది’’ అని యువతిని తాకే ప్రయత్నం చేశాడు. యువతిని తనవైపు లాగేందుకు రెండుసార్లు ప్రయత్నించాడు. ఈ చర్యలతో భయపడిన యువతి దుండుగుడిని బయటకు తోసి తలుపులు మూసింది. అనంతరం ఫేస్‌బుక్ ద్వారా తన స్నేహితుడు, తన రూంమేట్ అయిన యువతికి సమాచారాన్ని అందించింది. బాధితురాలి వద్దకు చేరుకున్న స్నేహితులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుడు తనను ఉద్దేశ్యపూర్వకంగా తాకాడని, అత్యాచారానికి ప్రయత్నించాడని పేర్కొంది. పారామెడిక్‌గా పనిచేస్తున్నానని, దుబాయ్‌లో ఫిలిప్పైన్స్‌కు చెందిన యువతితో రూంలో ఉంటున్నానని ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దుండగుడిపై కేసు నమోదు చేశారు. విచారణ కొనసాగుతోందని, విచారణ మే 3కు వాయిదా పడిందని పోలీసులు వెల్లడించారు.