Man-Leaves-Pregnant-Wife-to-Play-The-Game-Without-Any-Interference

పబ్‌జీ గేమ్‌కు బానిసై..గర్భవతి భార్యను కూడా పట్టించుకోని భర్త

మలేషియా: గత కొంతకాలంగా కుర్రకారు పబ్‌జీ గేమ్‌కు బానిసలైపోయారు. ఎక్కడికెళ్లినా యువకులందరూ ఫోన్ చేతిలో పట్టుకుని అరుస్తూ కనపడుతున్నారు. ఏంటా అని చూస్తే పబ్‌జీ గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్ గురించి తెలియని వారు వారికేదో పిచ్చి పట్టిందా అని అనుకున్న సందర్భాలు కూడా అనేకం. పబ్‌జీ ఆడుకోడానికి ఫోన్ కొనివ్వలేదని ఇటీవల గుజరాత్‌లో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గుజరాత్ ప్రభుత్వం అక్కడి పాఠశాలల్లో పబ్‌జీ గేమ్‌ను పూర్తిగా నిషేధించింది. యువతను బానిసల్ని చేయడమే కాకుండా సంసారుల మధ్య కూడా పోరు పెడుతోంది ఈ పబ్‌జీ. మలేషియాలో నివాసముంటున్న భార్యభర్తల మధ్య కొంతకాలంగా వాగ్వాదం జరుగుతోంది. నిత్యం తనతో పాటే ఉంటూ తనకు ఏ సమస్య రాకుండా చూసుకునే భర్త..పబ్‌జీ గేమ్‌కు బానిసై తాను గర్భవతిననే విషయాన్ని కూడా పట్టించుకోడమే మానేశాడని ఓ భార్య ఆవేదన చెందుతూ చెప్పింది. తమ బంధువుల ద్వారా తన భర్తకు పబ్‌జీ గేమ్ అలవాటు అయిందని..ప్రస్తుతం ఆ గేమ్‌కు తన భర్త బానిసైపోయి తనతో, కొడుకుతో మాట్లాడటం కూడా మానేశాడని చెప్తోంది. రాత్రంతా గేమ్ ఆడుతూనే ఉండటంతో..వ్యాపారం కూడా సరిగ్గా చేయలేకపోతున్నారంటూ బాధపడుతోంది. ప్రస్తుతం తన భర్త కుటుంబాన్ని కూడా వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడని..ఏదో ఒక పని చేసుకుంటూ గర్భవతినైన తానే కుటుంబాన్ని నడిపాల్సిన పరిస్థితి వచ్చిందంటూ మహిళ విచారం వ్యక్తం చేసింది.