Man-commit-suicide-after-came-from-Gulf

గల్ఫ్‌ బాధితుడి ఆత్మహత్య

దుబాయ్‌ వెళ్లి నెల రోజులకే తిరుగుముఖం

కార్గిల్‌ లేక్‌లో దూకి బలవన్మరణం

సిరిసిల్ల క్రైం, జనవరి 16:దుబాయ్‌ వెళ్లి నెల రోజులకే స్వగ్రామానికి తిరిగి వచ్చిన ఓ గల్ఫ్‌ బాధితుడు మంగళవారం కార్గిల్‌ లేక్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుం బసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన రేగుల ఆంజనేయులు(35) సెప్టెంబరులో ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లాడు. దుబాయ్‌లో అతడు భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసేవాడు. కానీ వేతనం తక్కువగా ఇస్తుండడంతో నెల రోజులే పని చేసి నవంబర్‌లో తిరిగి సిరిసిల్లకు వచ్చాడు. ఆంజనేయులు దుబాయ్‌ వెళ్లే సమయంలో ఏజెంట్‌కు రూ. 75 వేలు చెల్లించాడు.

కాగా ఆంజనేయులు భార్య లత తన ఇద్దరు పిల్లలు అభినయ్‌, అఖిలతో కలిసి సంక్రాంతి సందర్భంగా సిద్దిపేటలోని తల్లిగారింటికి వెళ్లిం ది. సోమవారం ఆమె ఆంజనేయులుకు ఫోన్‌ చేయగా స్వీచాఫ్‌ వచ్చింది. దీంతో ఆమె ఆందోళన చెంది తన ఆడబిడ్డను తీసుకొని ఇందిరానగర్‌లోని ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. ఇద్దరూ కలిసి ఆంజనేయులు కోసం పలుచోట్ల వెదకగా ఎక్కడా కనిపించలేదు. చివరికి కార్గిల్‌ లేక్‌ వైపు వెళ్లి చూడగా ఆంజనేయులు దుస్తులు చెరువు గట్టుపై కనిపించాయి. చెరువులో పరిశీలించగా ఆంజనేయులు మృతదేహం నీటిలో తేలుతూ కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా కార్గిల్‌ లేక్‌ నుంచి మృతదేహాన్ని తీసి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య లత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రాంచంద్రం తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆంజనేయులు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.