man-came-from-Australia-

తల్లి గెలుపుకోసం అస్ట్రేలియా నుంచి...

పల్లె ప్రగతికి ప్రవాసి తపన
సర్పంచ్‌కు నామినేషన్‌ వేయించిన కుమారుడు
నేడు ఆయన కూడా దాఖలు చేయనున్నట్టు వెల్లడి
 
అశ్వారావుపేట(భద్రాద్రి కొత్తగూడెం): గ్రామాభివృద్ధి కోసం తన తల్లితో సర్పంచ్‌గా నామినేషన్‌ వేయించేందుకు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు ఓ యువ ఇంజనీర్‌. అనుకోని పరిస్థితుల్లో.. అవసరమైతే తాను కూడా బరిలో ఉండేందుకు సిద్ధమని.. గ్రామస్థులు ఆశీర్వదిస్తే గ్రామాభివృద్ధికోసం తన వంతుగా పాటుపడతానని అంటున్నాడు ఆ యువకుడు. అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెం గిరిజన గ్రామపంచాయతీ ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్‌ స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. అదే పంచాయతీలోని కొత్తూరు గ్రామానికి చెందిన గిరిజన మహిళ భోగి బుచ్చమ్మ సర్పంచ్‌ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు నిర్ణయించారు. దీంతో విషయం తెలుసుకున్న భోగి వెంకటేశ్‌, బుచ్చమ్మ కుమారుడు శ్రీనివాసరావు అస్ట్రేలియా నుంచి గ్రామానికి వచ్చారు. ప్రస్తుతం శ్రీనివాసరావు అస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో యురేకా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా నెలకు రూ.రెండు లక్షల వేతనానికి పనిచేస్తున్నారు. అయితే బుచ్చమ్మ శుక్రవారం నామినేషన్‌ వేయగా తల్లితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... శనివారం తాను కూడా సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తానని శ్రీనివాసరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. తమ కుటుంబాన్ని ఆదరిస్తే గ్రామాభివృద్ధికి పాటుపడతామని తెలిపారు.