Man-bites-womans-cheeks-to-steal-her-bag-in-UAE

మహిళ బుగ్గ కొరికిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

షార్జా, యూఏఈ: షాపింగ్ ముగియడంతో ఇంటికి బయలుదేరిన ఓ అరబ్ మహిళకు షాకింగ్ ఘటన ఎదురైంది. ఇంటికి వెళ్తున్న మహిళ వద్దకు వచ్చిన ఓ నిందితుడు 10 దిర్హమ్స్ ఇవ్వాలని మహిళను అడిగాడు. స్పందించిన మహిళ డబ్బును ఇచ్చేందుకు బ్యాగు తీస్తుండగా ఒక్కసారిగా మహిళ బుగ్గ కొరికాడు. అనంతరం ఆమె నుదుటిపై కొరికేందుకు ప్రయత్నించాడు. బాధిత మహిళ తేరుకునేలోపే బాధిత మహిళ వద్ద ఉన్న బ్యాగును లాక్కొని పారిపోయాడు. బ్యాగులో పలు విలువైన వస్తువులతోపాటు మహిళకు చెందిన ఓ సెల్‌‌ఫోన్ కూడా ఉంది.  

రెండు రోజుల తర్వాత..
ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత దొంగిలించిన ఫోన్ నుంచి బాధితురాలి సోదరికి దుండగుడు ఫోన్ చేశాడు. ఇంటి చిరునామా చెపితే దొంగిలించిన సెల్‌‌ఫోన్‌ను తిరిగిచ్చేస్తానని చెప్పాడు. దీంతో నిందితుడి పోలీసులకు పట్టించాలని నిర్ణయించిన బాధితురాలు షార్జా పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై ఫిర్యాదు చేసింది. దుండగుడు మరోసారి ఫోన్ చేయడంతో అతడి లోకేషన్‌ను పోలీసులు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నేరానికి పాల్పడ్డానని, బ్యాగును దొంగతనం చేసింది తానేనని ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ఈ కేసుపై కోర్టులో విచారణ జరగనుందని, నిందితుడు తగిన శిక్ష ఎదుర్కోనున్నాడని పోలీసులు తెలిపారు.