Man-arrested-for-locking-India-supporters-inside-bird-cage-

దుబాయ్‌లో భారత కార్మికులను బంధించి..

దుబాయ్: ఓ దుబాయ్ యజమాని భారత కార్మికుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. తన వద్ద పనిచేస్తున్న వారిని కోళ్లను బంధించే గదిలో బంధించి తాళం వేశాడు. ఆసియా ఫుట్‌బాల్ కప్ మ్యాచ్‌లలో వారు భారత్‌కు మద్దతు తెలపడంతో యజమాని వారిని ఇలా బంధించాడని అధికారులు తెలిపారు. దుబాయ్‌లో ఉంటూ ఇక్కడ డబ్బు సంపాదిస్తూ మంచి జీవితం గడుపుతున్న మీరు తప్పకుండా దుబాయ్‌ టీమ్‌కు మద్దతు తెలపాలని వారిపై అతడు ఒత్తిడి తెచ్చాడన్నారు.

పైగా ఈ దృశ్యాలను వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీడియో చూసిన పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. మనుషులను బంధించి మానసిక క్షోభకు గురిచేయడం నేరమని వారు అన్నారు. ప్రతి వ్యక్తికి వ్యక్తిగత అభిప్రాయం ఉంటుందని దాన్ని గౌరవించాల్సిందేనని వారు తేల్చిచెప్పారు.

భారత కార్మికులను బంధించిన యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే యజమాని మాత్రం మరోలా తన వాదన వినిపిస్తున్నాడు. వీడియో కనిపించిన వ్యక్తులు తన వద్ద 22 ఏళ్లుగా పనిచేస్తున్నట్లు అతడు చెబుతున్నాడు. వారిని ఎన్నడూ ఎటువంటి ఇబ్బందులకు గురిచేయలేదన్నాడు. కేవలం నవ్వుకోవడం కోసమే అలా వీడియో తీయించానని అతడు పోలీసులకు చెప్పాడు. పోలీసులు మాత్రం అతడి మాటలు పట్టించుకోకుండా కేసు నమోదు చేశారు. అతడికి ఆరు నెలల నుంచి 10 యేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందన్నారు. అలాగే 50 వేల దిర్హమ్స్(రూ.9,58,114) నుంచి 2లక్షల దిర్హమ్స్(రూ.38,32,457) వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉందని వారు తెలిపారు.