London-City-Airport-Reopens

సురక్షితంగా బాంబు నిర్వీర్యం..సేవలు యథాతథం

లండన్: యూకేలోని లండన్ నగరంలో ఉన్న థేమ్స్ నదిలో గుర్తించిన రెండవ ప్రపంచ యుద్ధం నాటి బాంబును అధికారులు సురక్షితంగా నిర్వీర్యం చేశారు. బాంబుతోసహా మొత్తం 500 కేజీల బరువున్న యుద్ధ ఆయుధాలను ఘటనా స్థలం నుంచి తొలగించారు. దీంతో ఉత్కంఠ వీడిపోయింది. ఇక ముప్పేమిలేదని అధికారులు ప్రకటించారు. రెండు రోజుల నుంచి మూతపడిన లండన్ సిటీ ఎయిర్‌పోర్టును అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. మంగళవారం నుంచి సేవలు యథావిథిగా కొనసాగనున్నాయని తెలిపారు. రాయల్ నేవీ, మెట్రో పోలీసులు సంయుక్తంగా బాంబును సురక్షితంగా నిర్వీర్యం చేశారని, ఎలాంటి ప్రమాదం లేదని లండన్ సిటీ ఎయిర్‌పోర్ట్ సీఈవో రాబర్ట్ సింక్లెయిర్ తెలిపారు. ఇదిలావుండగా థేమ్స్ నదిలో బాంబును గుర్తించిన అధికారులు ముందస్తు చర్యలలో భాగంగా లండన్ సిటీ ఎయిర్‌పోర్టును మూసివేసిన సంగతి తెలిసిందే.