Letter-from-Saudi-child-to-dead-mother-

‘దీన్ని చదివి.. కన్నీరు కార్చకుండా ఉంటారా.. ఛాలెంజ్ చేస్తున్నా’

‘అమ్మా.. నేను కూడా చచ్చిపోయాక నీ దగ్గరకు వస్తా.. ఈ లెటర్ చూపిస్తా’

చనిపోయిన తన అమ్మకు లేఖ రాసిన ఓ బాలుడు.. సోషల్ మీడియాలో వైరల్

రియాధ్: అమ్మను మించి దైవమున్నదా.. అని రచయితలు ఊరికినే అనలేదు. సృష్టిలో దేనికయినా వెలకట్టగలమేమో కానీ.. అమ్మ ప్రేమకు మాత్రం ఖరీదు కట్టలేం. ఏ లాభం ఆశించకుండా మనల్ని ప్రేమించేది అమ్మమాత్రమే. తన కడుపు మాడ్చుకుని పిల్లల ఆకలి తీరుస్తుంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి.. మరో ఇంటికి వచ్చి సేవలు చేస్తుంది. ఆ ఇంటికి దీపం అవుతుంది. అమ్మ లేని బాధ ఏంటో స్వయంగా అనుభవించిన వారికే తెలుస్తుంది. అప్పటి వరకు తనకు గోరుముద్దలు తినిపించిన అమ్మ.. ఉన్నట్టుండి దూరమయితే.. లాలిపాటలు పాడి నిద్రపుచ్చిన అమ్మ.. కంటి ముందు కనిపించకపోతే, చిట్టీ, నాన్నా, కన్నా.. అంటూ బుజ్జగించిన అమ్మ మాటలు ఇక వినిపించకపోతే.. ఈ ప్రపంచం నుంచే దూరం అయిపోతే.. ఊహకందని బాధను అనుభవించిన ఓ సౌదీ బాలుడు.. తన కన్నీళ్లను అక్షర రూపంలో పేర్చాడు. చనిపోయిన తన అమ్మకు ఓ లేఖ రాశాడు.. అమ్మా తిరిగి రా.. నా దగ్గరకు రా అని తిరిగిరాని లోకాలకు వెళ్లిన అమ్మకు ఆహ్వానం పలికాడు. ఈ లోకంలో లేని తన అమ్మకు ఆ చిన్నారి బాబు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. అరబ్బీ భాషలో ఉన్న ఆ లేఖ సారాంశం యథాతథంగా...
 
‘‘అమ్మా.. ఎక్కడికి వెళ్లిపోయావమ్మా.. అందరూ నువ్వు రావంటున్నారు. నువ్వు చనిపోయావంటున్నారు. అంటే ఏమిటి అమ్మా.. దేవుడి దగ్గరకు వెళ్లావంటున్నారు. నువ్వు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని దేవుడిని కోరకుంటున్నానమ్మా. నేను రోజూ శ్రద్ధగా తింటున్నానమ్మా. ఎవరినీ విసిగించడం లేదు. నాన్న చెప్పినట్లు వింటున్నాను. ఇంతకుముందులా ఇంటిని చిందరవందర చేయడం లేదు. అమ్మా నన్ను క్షమించు అమ్మా.. నువ్వు తిరిగి రా అమ్మా. మాతో కలిసి ఉండు. ఇకపై నువ్వు ఏం చెప్పినా వింటానమ్మా. నిద్రలో కూడా మాటిమాటికి లేచి నిన్ను నిద్రపోనివ్వకుండా చేయను. ప్లీజ్ అమ్మా.. నా దగ్గరకు వచ్చెయ్ అమ్మా.. నువ్వు రాకుంటే నేను నీ దగ్గరకు వచ్చేస్తా అమ్మా.. నాతో పాటు ఈ లేఖను కూడా తెస్తా. నేను రాసిన ఈ లేఖను నీకు చూపిస్తా. నీపై నాకు ఎంత ప్రేమ ఉందో, నిన్ను ఎంతగా మిస్ అవుతున్నానో నీకు తెలియజేస్తానమ్మా.. ప్లీజ్ అమ్మా వచ్చెయ్.. నా దగ్గరకు వచ్చెయ్..’ అంటూ ఓ సౌదీ బాలుడు రాసిన లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 
 
ఈ లేఖను చదివిన తర్వాత కన్నీళ్లను ఆపుకోలేకపోయానని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. ‘తల్లిని కోల్పోవడం అంటే ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోగలను.. చిన్నతనంలోనే ఈ బాధను అనుభవించాల్సి  రావడం శోచనీయం’.. అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. తల్లిపై ఆ బాలుడికి ఎంత ప్రేమ ఉందో ఈ లేఖనే చెబుతోందని ఇంకొకరు, ఆ బాలుడి మాటలు నా గుండెల్లో గుచ్చుకున్నాయని మరొకరు కామెంట్ చేశారు. ‘మిత్రులారా మీకో ఛాలెంజ్.. ఈ లేఖను చదివి మనసు ద్రవించని, కన్నీరు కార్చకుండా ఎవరైనా ఉండగలరా..?’.. అని ఓ నెటిజన్ ఈ లేఖను షేర్  చేశాడు. ఏదిఏమైనా బాధలో ఉన్న ఆ చిన్నారికి స్వాంతన చేకూర్చాలని కోరుకుందాం.