kim-praises-southkorea-for-giving-fair-welcome-to-his-sister

ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన కిమ్ జాంగ్ ఉన్

ప్యాంగ్‌యాంగ్/సియోల్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పొరుగుదేశమైన దక్షిణకొరియాను ఆయన మెచ్చుకున్నారు. తన చెల్లెలు కిమ్ యో జోంగ్‌కు దక్షిణకొరియా ఆకట్టుకునే స్వాగతం పలికిందని ఆయన అన్నారు. కొరియన్ ద్వీపకల్పంలో శాంతిని నెలకొల్పడానికి ఇలాంటి చర్యలు ముఖ్యమని అభిప్రాయపడ్డారు. దక్షిణకొరియా నుంచి ఉత్తరకొరియా చేరుకున్న చెల్లెలు, ఆమె బృందానికి కిమ్ స్వాగతం పలికారు. మిలిటరీ స్వాగతం పలికించారు. ఈ విషయాన్ని ఉత్తరకొరియా అధికార వార్త సంస్థ కేసీఎన్‌ఏ తెలిపింది.
 
ఇదిలావుండగా కిమ్ జాంగ్ ఉన్‌కు అత్యంత నమ్మకస్తురాలైన ఆయన చెల్లులు దక్షిణకొరియాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ గేమ్స్‌కు అతిథిగా వెళ్లారు. దక్షిణకొరియాలో అడుగుపెట్టడం, ఉద్రిక్తవాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆమె పర్యటన వార్తల్లో నిలిచింది. ఈ పర్యటనలో భాగంగా దక్షిణకొరియాతో సంబంధాల పునరుద్ధరణ కోసం ఆమె కీలకంగా  వ్యవహరించారు. ఈ క్రమంలో దక్షిణకొరియా ప్రభుత్వం ఆమెకు సాదర స్వాగతం పలికింది. దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జేఇన్‌తో మాట్లాడిన ఆమె ఉత్తరకొరియాలో పర్యటించాలంటూ అధ్యక్షుడు మూన్‌ను ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై ఆయన ఆచితూచి స్పందించారు. సరైన పరిస్థితులు ఏర్పడ్డాక పర్యటిస్తారని సున్నితంగా సమాధానమిచ్చారు. ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలే మూన్ వైఖరికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలావుండగా చర్చలకు సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ మనసు త్వరలోనే మారిపోయే ప్రమాదం ఉందని, వింటర్ ఒలింపిక్స్ గేమ్స్ ముగిసిన అనంతరం అమెరికా, దక్షిణకొరియా సంయుక్తంగా నిర్వహించనున్న మిలిటరీ సంయుక్త సన్నాహాకాలే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.