Ivanka-Trump-security-in-High-level

ఇవాంకా ముందు ఇండియన్స్‌ గన్‌ పట్టుకోవద్దు

ట్రంప్‌ కూతురి భద్రతాధికారుల షరతు

ప్రధాని ఎస్పీజీ గన్‌ల సంగతేంటి?
తేల్చుకోలేకున్న భారతీయ అధికారులు
ఇవాంకాకు అధ్యక్షుడి స్థాయిలో భద్రత
ప్రత్యేక విమానంలో 20 వాహనాల రాక
ఎక్కడికెళ్లినా 60 వాహనాలతో కాన్వాయ్‌
హైదరాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విదేశీ పర్యటనలో ఆ దేశ భద్రతా సిబ్బంది చేసే హడావుడి అంతా ఇంతాకాదు. మొత్తం భద్రతా వ్యవస్థను తమ చేతిలోకి తీసుకుంటారు. ఇప్పుడు ఆయన కుమార్తె ఇవాంకా భారతదేశ పర్యటనలోనూ అదే స్థాయిలో హడావుడి చేస్తున్నారు. ఆమెతోపాటు 500 మందితో కూడిన అమెరికా బిజినెస్‌ డెలిగేషన్‌ కూడా వస్తుండటంతో భద్రత ఏర్పాట్లు ఈ స్థాయిలో ఉందని చెబుతున్నారు. 8వ గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌(జీఈఎస్)లో పాల్గొనేందుకు వైట్‌హౌస్‌ సలహాదారు హోదాలో ఇవాంకా ట్రంప్‌ ఇక్కడికి వస్తున్నారు. ఆమె భద్రత ఏర్పాట్ల గురించి అమెరికా భద్రత నిపుణులు నెలరోజులుగా ఇక్కడే మకాం వేశారు. ఎస్పీజీ, రాష్ట్ర పోలీస్‌లు తగు బలగాలను సమకూరుస్తున్నారు. ఇవాంక, ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. ఏర్పాట్లపై అమెరికా భద్రత శాఖ, ఎస్పీజీ, తెలంగాణ పోలీస్‌లు నిరంతర చర్చలు జరుపుతున్నారు. సమావేశ మందిరంతోపాటు, ఇవాంక పాల్గొనే కార్యక్రమాలో భారతీయ భద్రతా సిబ్బంది వద్ద ఆయుధాలు లేకుండా చూడాలని అమెరికన్‌ అధికారులు కోరుతున్నారు. టర్కీలో భద్రత విధులకు వచ్చిన స్థానిక పోలీసు అధికారి రష్యన్‌ అంబాసిడర్‌పై కాల్పులు జరిపిన ఘటన నేపథ్యంలో అమెరికా భద్రతా విభాగం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇవాంకతో పాటు ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. ప్రధాని భద్రత బాధ్యతలు నిర్వర్తించే ఎస్పీజీ నిరంతరం ఆయనకు నీడలా కాపలా ఉంటుంది. అమెరికా భద్రత అధికారుల కోరిక నేపథ్యంలో ఏం చేయాలనేది చర్చిస్తున్నారు. మొత్తం 1500 మంది వీఐపీలు పాల్గొంటున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 
భారీ కాన్వాయ్‌..
ఇవాంక ట్రంప్‌ కాన్వాయ్‌లో 60 వరకు వాహనాలు ఉంటాయి. ఇవాంక ఉపయోగించే వాహనాలు అమెరికా నుంచే వస్తున్నట్లు సమాచారం. అధికారులు ఉపయోగించే వాహనాలు మొత్తం కలిపి అమెరికా నుంచి ప్రత్యేక విమానాల్లో 15-20 వాహనాలు హైదరాబాద్‌కు వస్తున్నాయి. ఇవాంక అధికారగణం ఉపయోగించే కార్లల్లో ఒక్కో కార్లో డ్రైవర్‌తో పాటు వెనక సీట్లో మరో ఇద్దరు అధికారులు మాత్రమే కూర్చుంటారు. ఇక్కడి భద్రతా అధికారుల కాన్వాయ్‌ కలిస్తే 60 వాహనాలు అవుతాయి. హెచ్‌ఐసీసీ, ఫలక్‌నూమా ప్యాలె్‌సకు రాకపోకలు సాగించే మార్గాలకు సంబంధించి రెండు రోజుల్లో రూట్‌మ్యాప్‌ ఖరారు చేయనున్నారు. కొద్ది రోజుల ముందుగానే రిహార్సల్స్‌ నిర్వహిస్తారు. పాతబస్తీలో కాన్వాయ్‌ వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇవాంక షాపింగ్‌, నగర అందాల్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తే పరిస్థితి ఏమిటనే దానిపైనా అధికారులు దృష్టిసారించారు.
 
భద్రతా పరికరాలు... ఫోన్లపై నిఘా
ఇవాంక భద్రత విషయంలో అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ అన్ని జాగ్రత్తలు చేపట్టింది. హెచ్‌ఐసీసీ, ఫలక్‌నూమా ప్యాలెస్‌, ఇవాంక రాకపోకలు సాగించే మార్గాల్ని అమెరికా భద్రతా అధికారులు పరిశీలిస్తున్నారు. కాన్వాయ్‌లోని వాహనాలతోపాటు భద్రతకు అవసరమైన అత్యాధునిక ఆయుధాలు, పరికరాల్ని అమెరికా నుంచే తెప్పిస్తున్నారు. హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లోని సెల్‌ఫోన్లపై కూడా నిఘా పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఫలక్‌నూమా ప్యాలెస్‌ చుట్టు పక్కల ప్రాంతాల్లో తాత్కాలికంగా 500 సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేసి ప్రత్యేక కంట్రోల్‌రూంతో పర్యవేక్షించనున్నారు. ఇదిలా ఉండగా, ఇవాంక భద్రత విధుల్లో ఓ మహిళా ఐపీఎస్‌ నేతృత్వంలో మహిళా సిబ్బందిని నియమించేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం.