Israel-capital-is-Jerusalem-says-Trump

ఇజ్రాయెల్‌ రాజధాని.. జెరూసలెం!

 టెల్‌అవీవ్‌ నుంచి అక్కడకు..ఎంబసీ
 నేడు ప్రకటించనున్న డొనాల్డ్‌ ట్రంప్‌
 ట్రంప్‌పై రగులుతున్న అరబ్‌ దేశాలు
 మూడురోజుల నిరసనలకు పిలుపు
 
వాషింగ్టన్‌, డిసెంబరు 6: ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరూసలెంను అమెరికా గుర్తించనుంది. ప్రస్తుత రాజధాని టెల్‌ అవీవ్‌ నుంచి తమ రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు మార్చాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయించారు. ఈ విషయాన్నే స్వయంగా ఆయన బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత ప్రకటిస్తారని వైట్‌హౌస్‌ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం జెరూసలెం ఇటు ఇజ్రాయెల్‌కు, అటు పాలస్తీనాకు పవిత్ర నగరంగా కొనసాగుతోంది. భవిష్యత్తులో ఏర్పడే తమ దేశానికి తూర్పు జెరూసలెంను రాజధానిగా చేసుకోవాలన్న ఆలోచనలో పాలస్తీనా పాలకులు ఉన్నారు. ఇలాంటి తరుణంలో అమెరికా తీసుకొన్న నిర్ణయం పశ్చిమాసియా వ్యవహారాల్లో పెను మార్పులను తీసుకురానుంది. ఈ పరిణామం సహజంగానే అరబ్‌ దేశాలను ఆగ్రహానికి గురి చేస్తోంది. మూడు రోజుల నిరసనలకు అవి పిలుపునిచ్చాయి. ట్రంప్‌ ప్రకటన చేయనున్న దృష్ట్యా.. అరబ్‌ దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. జెరూసలెం పాతనగరం, వెస్ట్‌ బ్యాంక్‌లను వదిలి రావాల్సిందిగా తమ ఉద్యోగులను అమెరికా అప్రమత్తం చేసింది. టెల్‌ అవీవ్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు మార్చాలని తన ప్రసంగంలో ట్రంప్‌ కోరనున్నారు. అయితే, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఎంతలేదన్నా మూడేళ్లు పడుతుందని వైట్‌హౌస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
 
మామ మాట.. అల్లుడి ఆచరణ
అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్‌ అవీవ్‌ నుంచి జెరూసలెంకు మార్చాలన్న ప్రతిపాదన ఈనాటిది కాదు. 22 ఏళ్లుగా నలుగుతున్న అంశం ఇది. కాకపోతే, పాలస్తీనా, ఇజ్రాయెల్‌ల మధ్య సంబంధాలను మెరుగుపరిచి, సఖ్యత కుదర్చడానికి జరుగుతున్న ప్రయత్నాలకు అడ్డు కాకూడదనే ఉద్దేశంతో, ఎప్పటికప్పుడు ఈ ప్రతిపాదనను అమెరికా అటకెక్కిస్తూ వస్తోంది. అధికారంలోకి రాగానే ట్రంప్‌ తాను చేపడతానన్న అంశాల్లో ఇదీ ఒకటి. ట్రంప్‌కు సలహదారుగా వ్యవహరిస్తున్న ఆయన అల్లుడు జారెడ్‌ కుష్నేర్‌ ఆరునెలలుగా ఈ వ్యవహారంపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. కాగా దీర్ఘకాల మిత్రదేశం సౌదీ అరేబియా సహా ఫ్రాన్స్‌, ఈయూ, జోర్డాన్‌ తదితర దేశాలు.. తొందరపాటు తగదని ట్రంప్‌కు హితవు పలుకుతున్నాయి.